Betel Leaves Plant : తమల పాకు తీగ చెట్టు.. ఇది మనందరికీ తెలుసు. చాలా మంది ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. తమలపాకును తాంబూలంగా చేసి తినే వారు కూడా చాలా మందే ఉంటారు. దీనిని నాగవల్లి అని కూడా అంటారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా తమలపాకును ఔషధంగా ఉపయోగిస్తారు. ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడుకి తావు ఉండదు అని పండితులు చెబుతుంటారు. తమలపాకు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు అన్నీ పోతాయి. మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఈ చెట్టు గనక మన ఇంట్లో ఉంటే మనకు ఎటువంటి గ్రహదోషాలు ఉండవు. భూత ప్రేత పిశాచులు మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.
తమలపాకు తీగ మొక్క మన ఇంట్లో ఉంటే సాక్షాత్తూ ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉన్నట్టే. ఈ మొక్క ఎదుగుతూ, చిగురిస్తూ ఉంటే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్టే. అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుండాలన్నా కూడా తమలపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకోవాలి. మన ఇంట్లో ధనం సమృద్ధిగా ఉండాలనుకునే వారు ప్రతిరోజూ ఒక తమలపాకును తీసుకుని దానిపై నువ్వుల నూనె కలిపిన సింధూరంతో శ్రీరామ అని రాసి దానిని ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఉంచి నమస్కరించాలి. మరుసటి రోజు ఉదయం దానిని తినడం కానీ, పారే నీటిలో వేయడం కానీ చేయాలి. అంతేకానీ ఆ ఆకును చెత్త బుట్టలలో, అందరూ నడిచే చోట వేయకూడదు. ఇలా చేయడం వల్ల మనం లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చని పండితులు చెబుతున్నారు.
ఈ మొక్క ఎక్కువగా తేమ ఉండే వేడి ప్రాంతంలో పెరుగుతుంది. తమలపాకు మొక్క నాటిన రెండు నెలల తరువాత కోతకు వస్తుంది. తమలపాకులు కూడా వివిధ రకాలు ఉంటాయి. మన దగ్గర తుని తమలపాకుకు ఎంతో పేరు ఉంది. ఈ తుని తమలపాకులు లేతగా చిన్నగా కారంగా ఉంటాయి. మన ఇండ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది. దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఉండవని చాలా మంది నమ్ముతారు. ఆర్థిక సమస్యలే కాకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కూడా ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గొంతునొప్పిని తగ్గిండంలో తమలపాకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆకులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.
తమలపాకులలో విటమిన్ ఎ, విటమిన్ సి లతోపాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఈ ఆకుకు నూనె రాసి వేడి చేసి ఛాతి మీద ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాలింతలలో పాలు ఎక్కువైతే అవి గడ్డలు కడతాయి. అలాంటప్పుడు తమలపాకుకు ఆముదాన్ని రాసి స్థనాలపై ఉంచాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు షర్బత్ తాగడం వల్ల గుండె బలంగా తయారవుతుంది. ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. తమలపాకు రసాన్ని పాలల్లో కలుపుకుని తాగడం వల్ల క్షణికావేశాలు తగ్గుతాయి. తమలపాకులను తరచూ తింటూ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
నువ్వుల నూనెలో, ప్రొద్దు తిరుగుడు నూనెలో, ఆముదం నూనెలో, పల్లి నూనెలో తమలపాకును వేసి ఉంచడం వల్ల అవి త్వరగా పాడవకుండా ఉంటాయి. తమలపాకును తినేటప్పుడు వాటికి ఉన్న తొడిమెను తొలగించి తినాలి. అధిక బరువుతో బాధపడే వారు రోజూ ఒక తమలపాకులో 10 గ్రాముల మిరియాలను కలిపి తినాలి. ఇలా చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు. తమలపాకు రసం, అల్లం రసం, తులసి ఆకుల రసం, మిరియాల పొడి, తేనెను కలిపి నాకించడం వల్ల పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.
తమలపాకులను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. ఒక టీ స్పూన్ తమలపాకు రసంలో, మిరియాల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. తమలపాకును వేడి చేసి కీళ్ల వాపులపై ఉంచి కట్టు కట్టాలి. ఇలా చేయడం వల్ల వాపులు తగ్గిపోతాయి. తమలపాకుల ముద్దను తలకు పట్టించి ఒక గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. తమలపాకును తరచూ తింటూ ఉండడం వల్ల పురుషులల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఈ విధంగా తమలపాకు చెట్టును ఉపయోగించి మనకు వచ్చే ఆర్థికపరమైన, అనారోగ్య పరమైన సమస్యల నుండి బయటపడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.