Holy Basil Leaves : తులసి మొక్క.. మనం నిత్యం పూజించే మొక్కల్లో ఇది ఒకటి. హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. తులసి మొక్క లేని ఇల్లు గుడి లేని ఊరు మన దేశంలోనే ఎక్కడా కనిపించవని మన పెద్దలు చెబుతుంటారు. అలాగే తులసి మొక్క మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరిలో శంకరుడు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే దేవాలయంలో ఇచ్చే తీర్థంలో తులసిని కలుపుతారు. తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి మొక్కలో ఐదు రకాలు ఉన్నప్పటికీ కృష్ణ తులసిని, రామ తులసిని మాత్రమే ఉపయోగిస్తారు.
మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తులసి మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నోటి పూత, నోట్లో అల్సర్లు వంటి వాటిని తగ్గించడంలో తులసి మొక్క మనకు ఎంతో సహాయపడుతుంది. ప్రధానంగా చిన్న పిల్లల్లో తరచూ జలుబు, దగ్గు, డయేరియా, జ్వరం, వాంతుల వంటి అనారోగ్య సమస్యలను తులసి మొక్కను ఉపయోగించి నయం చేసుకోవచ్చు. తులసి ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. దంత సంబంధిత సమస్యలతో బాధపడే వారు తులసి ఆకుల పొడితో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఆవ నూనెలో తులసి ఆకుల పేస్ట్ ను కలిపి ఆ మిశ్రమంతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంత క్షయంతోపాటు నోటి దుర్వాసన పోయి దంతాలు అందంగా తయారవుతాయి. జ్ఞాపక శక్తిని పెంపొందించే గుణం కూడా తులసి ఆకులకు ఉంటుంది. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల వ్యాప్తి తీవ్రతరంగా ఉంటుంది. అలాంటప్పుడు లేత తులసి ఆకులతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల ఈ రకం జ్వరాల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. జ్వరం మరీ ఎక్కువగా ఉంటే తులసి ఆకులను, యాలకుల పొడిని అర లీటర్ నీటిలో వేసి బాగా మరిగించి కషాయం తయారు చేసి తీసుకోవాలి.
ఈ కషాయంలో తేనె, పాలు కలిపి తీసుకుంటే జ్వరం తీవ్రత తగ్గుతుంది. జ్వరంతో బాధపడుతన్నప్పుడు తులసి ఆకులను మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండు లేదా మూడు గంటలకొకసారి తాగవచ్చు. బ్రొంకైటిస్, ఆస్థమా వంటి వ్యాధులను నయం చేయడంలో తులసి మనకు ఎంతగానో ఉసయోగపడుతుంది. తులసి ఆకులను నోట్లో ఉంచి నమలడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వాటి నుండి ఉపశమనం కలుగుతుంది. తులసి ఆకులను, మిరియాలను, ధనియాలను కలిపి మెత్తగా నూరాలి. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల ఎంతటి తీవ్రమైన దగ్గు అయినా నయం అవుతుంది.
అంతేకాకుండా ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల కడుపులో నులి పురుగులు నశిస్తాయి. ధాన్యం నిల్వ చేసే చోట ఎండిన తులసి ఆకులను ఉంచడం వల్ల ధాన్యం పాడవకుండా ఉంటుంది. తులసి ఆకులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచే శక్తి కూడా ఉంది. తులసి ఆకులను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ తులసి మనకు దోహదపడుతుంది. తులసి రసంలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల పైత్యం తగ్గుతుంది. మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడే వారు తులసి ఆకుల రసంలో పాలు, చక్కెర కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
తులసి ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు, మొటిమలు పోయి ముఖం అందంగా తయారవుతుంది. తులసి మొక్క వాసన ఘూటుగా ఉంటుంది. కనుక ఈ మొక్క వాసన వ్యాపించినంత దూరం వరకు ఈగలు, దోము, పాములు రాకుండా ఉంటాయి. తులసి ఆకులు నీటిలో ఉండే ఫ్లోరోసిస్ ను తగ్గిస్తాయని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఇలా తులసి మొక్క మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా వైద్యుని వద్దకు వెళ్లే అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు.