Nela Usiri : మన చుట్టూ అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి. కానీ వాటిని మనం పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. ఎక్కడపడితే అక్కడ పెరగడంతోపాటు ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో నేల ఉసిరి మొక్క ఒకటి. ఈ మొక్క నేలకు మూరెడు ఎత్తులోనే పెరిగే చాలా చిన్న మొక్క. ఈ మొక్క కాయలు చాలా విచిత్రంగా, చాలా చిన్నగా ఉంటాయి. ఈ మొక్కను మనం రోజూ చూస్తూనే ఉంటాం. కానీ ఈ మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మనకు తెలియవు. చూడడానికి చాలా చిన్నగా ఉన్నప్పటికి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతో ఉపయోగపడుతుంది. చర్మ సంబంధమైన సమస్యలను, మూత్రాశయ సంబంధిత సమస్యలను, స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలను నయం చేయడంలో నేల ఉసిరి మొక్క చక్కని ఔషధంలా పని చేస్తుంది. ఈ మొక్క మనకు రెండు రకాలుగా లభిస్తుంది. మొక్క కాడలు ఎరుపు రంగులో ఉంటే ఎర్ర నేల ఉసిరి అని, తెలుపు రంగులో ఉంటే తెల్ల నేల ఉసిరి అని పిలుస్తూ ఉంటారు. వాత, కఫ, పైత్య సంబంధిత అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడతుంది.
పొత్తి కడుపులో వచ్చే నొప్పిని తగ్గించడంలో, శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో, మూత్ర, ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంలోనూ నేల ఉసిరి మొక్క ఎంతో సహాయపడుతుంది. మగ వారిలో వీర్య కణాల సంఖ్యను పెంచే శక్తి నేల ఉసిరి మొక్కకు ఉంది. ఈ మొక్క ఆకు రసంలో నూనెను వేసి వేడి చేసి కళ్లల్లో వేసుకోవడం వల్ల కళ్ల సమస్యలు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. ఈ మొక్క ఆకులను మజ్జిగతో కలిపి మెత్తగా నూరి చర్మానికి రాయడం వల్ల గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి.
నేల ఉసిరి మొక్క ఆకులను లేదా వేరును బియ్యం కడుగుతో ఉడికించి కట్టుగా కట్టడం వల్ల వ్రణాల వాపు, నొప్పి తగ్గుతాయి. ఈ ఆకును ఉప్పుతో కలిపి మెత్తగా నూరి రాయడం వల్ల గాయాలు, నోటిలో పుండ్లు, పొక్కులు తగ్గుతాయి. పాలతో నూరి తీసుకోవడం వల్ల ఉదర, మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల రసంలో పసుపును కలిపి రాపుకోవడం వల్ల సమస్త చర్మ వ్యాధులు తగ్గుతాయి.
నేల ఉసిరి మొక్క ఆకుల రసాన్ని బియ్యం కడిగిన నీటితో కలిపి రెండు పూటలా ఒక టీ స్పూన్ చొప్పున తీసుకోవడం వల్ల నెలసరి సమయంలో అధిక రక్తస్రావం సమస్య తగ్గుతుంది. ఈ మొక్క ఆకులను నీడలో ఎండబెట్టి చూర్ణంగా చేసి వేడి నీటితో కలిపి తీసుకోవడం వల్ల పచ్చ కామెర్లతోపాటు కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. వైరస్ ల వల్ల కలిగే అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క ఎంతో సహాయపడుతుంది. రక్త హీనతను, నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడంలో, స్త్రీలలో వచ్చే వైట్ డిశ్చార్జ్ సమస్యను తగ్గించడంలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.