Pacha Ganneru : మనం ఇంటి పెరట్లో అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇలా ఇంటి పెరటిలో పెంచుకునే పూల మొక్కలలో కొన్ని మొక్కలు మనకు హానిని కలిగించేవి కూడా ఉంటాయి. ఇలాంటి మొక్కలలో పచ్చ గన్నేరు చెట్టు కూడా ఒకటి. మనకు ఎర్ర గన్నేరు, తెల్ల గన్నేరు, బిళ్ల గన్నేరు, పచ్చ గన్నేరు ఇలా రకరకాల గన్నేరు మొక్కలు లభిస్తూ ఉంటాయి. ఈ చెట్టు ఆకులు సన్నగా, పొడుగ్గా, పువ్వులు పసుపు పచ్చ రంగులో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చెట్టు చాలా సులువుగా పెరుగుతుంది.
నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో కూడా ఈ చెట్టు పెరుగుతుంది. పచ్చ గన్నేరు చెట్టుకు సూసైడ్ ప్లాంట్ అనే పేరు కూడా ఉంది. ఈ చెట్టు గింజలనే గన్నేరు పప్పు అంటారు. ఈ చెట్టు గింజలను తినడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లడమే కాకుండా మరణం కూడా సంభవిస్తుంది. ఈ చెట్టు గింజలల్లో ఉండే విషం హృదయ స్పందనలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. పచ్చ గన్నేరు గింజలను తిని బ్రతికినా కూడా భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇక ఈ చెట్టు నుండి వచ్చే పాలు కూడా విషపూరితమైనవే. ఈ మొక్కను ఇండ్లలో పెంచుకోకపోవడమే మంచిదట. ఈ చెట్టు గాలి సోకినా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయట. మఖ్యంగా పిల్లలను ఈ చెట్టుకు దూరంగా ఉంచాలి. పచ్చ గన్నేరు చెట్టు ఎంతో విషపూరితమైనది. అయినప్పటికీ ఈ చెట్టు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ చెట్టు ఉపయోగపడుతుంది. అయితే బాహ్య శరీరంపై మాత్రమే ఈ చెట్టు నుండి తయారు చేసే రసాలను, కషాయాలను ఉపయోగించాలి. కడుపులోకి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ తీసుకోకూడదు.
పచ్చ గన్నేరు చెట్టును ఔషధంగా ఉపయోగించేటప్పుడు దీని గురించి బాగా తెలిసిన వారి సమక్షంలో లేదా ఆయుర్వేద నిపుణుల సమక్షంలో మాత్రమే ఉపయోగించాలి. తెలిసీ తెలియకుండా ఈ చెట్టును ఔషధంగా ఉపయోగించడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.