Palleru : ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో పల్లేరు మొక్క కూడా ఒకటి. పల్లేరు మొక్క బహు వార్షిక మొక్క. ఈ మొక్కలోని ఔషధ గుణాలు, ఈ మొక్క వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలిస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క సంవత్సరం పొడవునా నేలపై పాకుతూ పెరుగుతుంది. పల్లేరు మొక్క మనకు విరివిరిగా కనిపిస్తూ ఉంటుంది. వీటి పువ్వులు పసుపు రంగులో ఉంటాయి. పల్లేరు మొక్క కాయలు ముళ్లను కలిగి ఉంటాయి. ఈ మొక్కను చాలా మంది చూసే ఉంటారు. కానీ దీనిలో ఉండే ఔషధ గుణాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. పల్లేరు మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రపిండాలలో రాళ్ల సమస్యను నివారించడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. పల్లేరు కాయలను దంచి రసాన్ని తీసుకోవాలి. దీనిని అర కప్పు మోతాదులో రోజుకు రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల మూత్రపిండాలలో రాళ్లు కరుగుతాయి. అదే విధంగా పల్లేరు కాయలను లేదా పల్లేరు మొక్క మొత్తాన్ని నీటిలో వేసి మరిగించి చల్లారిన తరువాత ఆ నీటిని తాగుతూ ఉండడం వల్ల కూడా మూత్రపిండాలలో రాళ్లు కరిగిపోయి మూత్రం ద్వారా బయటకు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒక టేబుల్ స్పూన్ పల్లేరు కాయలను, ఒక టేబుల్ స్పూన్ ధనియాలను నీటిలో వేసి మరిగించి వడకట్టుకుని ఆ నీటిని తాగుతూ ఉండడం వల్ల మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రంలో రక్తం వస్తున్నప్పుడు ఈ మొక్క మొత్తాన్ని సేకరించి దంచి పావు కప్పు రసాన్ని తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకుని తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల మూత్రంలో రక్తం రావడం తగ్గుతుంది.
ఒక గ్లాస్ పాలలో పల్లేరు కాయలను వేసి మరిగించి వడకట్టుకుని తాగడం వల్ల నిత్యం యవ్వనంగా కనిపిస్తూ ఉంటారని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. 2 టీ స్పూన్ల పల్లేరు కాయల పొడిని ఒక గ్లాస్ నీళ్లలో వేసి పావు కప్పు అయ్యే వరకు మరిగించి తాగడం వల్ల ఆయాసంతోపాటు గుండె సంబంధిత సమస్యలు తగ్గి గుండె బలంగా తయారవుతుంది. కామెర్ల వ్యాధిని తగ్గించే గుణం కూడా పల్లేరు మొక్కకు ఉంటుంది. ఈ మొక్క మొత్తాన్ని తీసుకుని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. దీనికి ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని, 6 మిరియాల గింజల పొడిని, ఒక టీ స్పూన్ పటిక బెల్లం పొడిని కలిపి నిల్వ చేసుకోవాలి. దీనిని అర టీ స్పూన్ మోతాదులో రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల కామెర్ల వ్యాధి తగ్గుతుంది.
పల్లేరు కాయలను దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని అరికాళ్లలోకి ఇంకేలా రాసుకోవడం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఈ మొక్క కాయల కషాయాన్ని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. అంతేకాకుండా చిగుళ్ల సమస్యలు, దంతాల సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ కషాయాన్ని తాగడం వల్ల స్త్రీలలో వచ్చే నెలసరి సమస్యలు తగ్గి నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది. పల్లేరు మొక్క ఆకులను వస్త్రంలో వేసి మూటగా కట్టి ఆ మూటను కళ్లు మూసుకుని కళ్ల పై ఉంచుకోవడం వల్ల కళ్ల కలక సమస్య తగ్గుతుంది. ఈ మొక్క బెరడుతో చేసిన కషాయాన్ని, పటిక బెల్లం పొడిని కలిపి అర టీ స్పూన్ మోతాదులో రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. పల్లేరు మొక్క పువ్వులను ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ 2 గ్రా. ల మోతాదులో రెండు ఎండుద్రాక్షలతో కలిపి మూడు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల ఆయాసం, ఉబ్బసం వంటి సమస్యలు తగ్గుతాయి.
5 గ్రా. పల్లేరు కాయల పొడిని, 2 గ్రా. పటిక బెల్లాన్ని రెండు గ్లాసుల నీటిలో వేసి ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించి చల్లారిన తరువాత తాగుతూ ఉండడం వల్ల నడుము నొప్పి, కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ఒక టీ స్పూన్ పల్లేరు కాయల పొడిని, ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడిని ఒక కప్పు పాలల్లో వేసి మరిగించి వడకట్టుకుని రోజూ రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల పురుషులల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఈ విధంగా పల్లేరు మొక్కలో ప్రతి భాగం మనకు ఎంతో ఉపయోగపడుతుందని, దీనిని ఉపయోగించి మనకు వచ్చే అనేక రకాల సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.