Vajravalli : కీళ్ల నొప్పులతో బాధ పడే వారు ప్రస్తుత కాలంలో ఎక్కువవుతున్నారు. ఈ నొప్పుల కారణంగా వారు సరిగ్గా నడవలేరు, నిలబడ లేరు, కూర్చోలేరు, వారి పనులను కూడా వారు చేసుకోలేరు. వీరి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఈ నొప్పులను తగ్గించుకోవడానికి వీరు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎటువంటి ఫలితం లేని వారు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఆయుర్వేదం ద్వారా ఈ నొప్పులను చాలా సులువుగా తగ్గించుకోవచ్చు.
మన ఇంట్లో, ఇంటి పరిసరాలలో అనేక ఔషధ గుణాలు కలిగిన మొక్కలు చాలానే ఉంటాయి. కానీ వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక వీటిని మనం ఉపయోగించుకోలేక పోతున్నాం. ఇలాంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో నల్లేరు మొక్క ఒకటి. దీనిని వజ్రవల్లి, హడ్ జోడ్ అని కూడా అంటారు. ఈ మొక్క తీగ జాతికి చెందినది. కంచెలకు, పెద్ద పెద్ద వృక్షాలకు ఈ మొక్క అల్లుకుని పెరుగుతూ ఉంటుంది. ఇది చాలా సులువుగా పెరుగుతుంది. ప్రస్తుత కాలంలో దీనిని అలంకరణ మొక్కగా కూడా పెంచుకుంటూ ఉన్నారు. దీని కాడలు నాలుగు పలకలుగా ఉంటాయి. ఈ కాడలపై ఉండే పొట్టును తొలగించి పచ్చళ్లు, పులుసు కూరలు, వడియాల వంటి వాటిని చేసుకుని తినవచ్చు.
ఎముకలను దృఢంగా చేసి కీళ్ల నొప్పులను తగ్గించడంలో ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది. ఈ మొక్కను తాకడం వల్ల కొందరిలో చేతులకు దురదలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుని ఈ మొక్కను ఉపయోగించాలి. నల్లేరు రసం, శుద్ద గుగ్గిలం, మద్ది చెక్క పొడి, అశ్వ గంధ చూర్ణం, అతి బల వేరు చూర్ణాన్ని సమ పాలల్లో తీసుకుని ముద్దగా నూరి రేగి పండు గింజంత పరిమాణంలో మాత్రలుగా చేసి ఉదయం, సాయంత్రం భోజనానికి గంట ముందు ఒక మాత్ర చొప్పున తీసుకోవడం వల్ల విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. ఎముకలు దృఢంగా తయారయి నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పులే కాకుండా మనకు వచ్చే అనేక రకాల వాత, కఫ సంబంధమైన సమస్యలను తగ్గించడంలోనూ ఈ మొక్క ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.