Vempali Chettu : మనకు పొలాల గట్లపై, రోడ్డుకు ఇరు వైపులా అనేక రకాల చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఇలా కనిపించే వాటిలో వెంపలి చెట్టు కూడా ఒకటి. చాలా మంది దీనిని చూసి ఏదో పిచ్చి మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ వెంపలి చెట్టు ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. వెంపలి చెట్టు యాంటీ సెప్టిక్ గా పని చేస్తుంది. గాయాలపై ఈ మొక్క ఆకుల రసాన్ని రాయడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. ఈ మొక్క వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు గట్టిగా మారుతాయి. దంతాల సమస్యలు తగ్గి దంతాలు ఆరోగ్యంగా మారుతాయి.
తేలు విషాన్ని హరించే శక్తి కూడా వెంపలి చెట్టుకు ఉందని నిపుణులు చెబుతున్నారు. వెంపలి చెట్టు మొత్తాన్ని తీసుకు వచ్చి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని పూటకు పావు టీ స్పూన్ చొప్పున ఆవు పెరుగులో కలుపుకుని రెండు పూటలా తింటూ ఉండడం వల్ల జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
మొలల సమస్యతో బాధ పడే వారు వెంపలి చెట్టు ఆకులను ఎండబెట్టి పొడిగా చేసి దానికి సమపాళ్లలో పటిక బెల్లం పొడిని కలుపుకుని తాగడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది. నోటిపూత, గొంతులో సమస్యలు ఉన్న వారు వెంపలి చెట్టు వేరును కొద్ది కొద్దిగా నములుతూ రసాన్ని మింగడం వల్ల నోటిపూత, గొంతు సమస్యలు తగ్గుతాయి. వెంపలి చెట్టు మొత్తాన్ని పొడిగా చేసి ఆ పొడిని 5 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించి కషాయంగా తయారు చేసుకోవాలి. ఈ కషాయానికి పటిక బెల్లాన్ని కలిపి తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. ఈ కషాయాన్ని తాగడం వల్ల అజీర్తి, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు వెంపలి చెట్టు వేరును పేస్ట్ లా చేసి దీనిని 2 గ్రా. ల మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తాగడం వల్ల కాలేయ సమస్యలు తగ్గి కాలేయం ఆరోగ్యవంతంగా తయారవుతుంది. ఈ మొక్క మొత్తాన్ని సేకరించి దాని నుండి రసాన్ని తీసి రోజుకు25 గ్రా. ల మోతాదులో రెండు పూటలా తీసుకోవడం వల్ల కామెర్ల వ్యాధి నయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
వెంపలి చెట్టు ఆకులను, వేప ఆకులను కలిపి డికాషన్ లా చేసుకుని తాగడం వల్ల శరీరం నుండి మలినాలు తొలగిపోతాయి. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వెంపలి చెట్టు వేరుతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల అతిసారం, మూత్రాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో కూడా వెంపలి చెట్టు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.