Vidarigandha : మన చుట్టూ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు పెరుగుతుంటాయి. కానీ వాటిల్లో మనకు కేవలం కొన్ని మొక్కల గురించి మాత్రమే తెలుసు. ఇంకా అనేక మొక్కల గురించి తెలుసుకోవాల్సి ఉంది. అలాంటి మొక్కల్లో విదారిగంధ మొక్క కూడా ఒకటి. దీన్నే అన్షుమతి, షలపర్ణి అని కూడా పిలుస్తారు. తెలుగులో ఈ మొక్కను జిటనారం, కొలకుపొన్న, నక్కతోకపొన్న అని పిలుస్తారు. అయితే ఈ మొక్క గురించి మనలో చాలా మందికి తెలియదు. కానీ మన చుట్టూ పరిసరాల్లోనే పెరుగుతుంది. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి దీనికి ఉంది.
ఈ మొక్క మన దేశంతోపాటు చైనా, ఆఫ్రికాలలో ఎక్కువగా పెరుగుతుంది. దీని పువ్వులు నీలం రంగులో ఉంటాయి. ఆగస్టు నుంచి నవంబర్ మధ్య కాలంలో ఈ పువ్వులు లభిస్తాయి. ఇక ఈ మొక్కకు చెందిన వేళ్ల పొడిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. ఇది మనకు మార్కెట్‌లోనూ లభిస్తుంది. దీంతో అనేక రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే విదారిగంధ మొక్క మనకు ఎలా ఉపయోగపడుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
విదారిగంధ మొక్క వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది వాత, కఫ దోషాలను తొలగించగలదు. ఇక ఈ మొక్కను ఉపయోగించడం వల్ల తీవ్రమైన శ్వాసకోశ సమస్యల నుంచి సైతం బయట పడవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి. దీంతో ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. అలాగే దగ్గు, జలుబు, బ్రాంకైటిస్, ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక జీర్ణ సమస్యలను సైతం ఈ మొక్క తగ్గించగలదు.
విదారిగంధ మొక్కను ఉపయోగించడం వల్ల గ్యాస్, విరేచనాలు, వికారం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు అన్నీ తగ్గుతాయి. అలాగే అల్సర్లను కూడా నయం చేసుకోవచ్చు. ఈ మొక్కను ఉపయోగించడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతగానో మేలు జరుగుతుంది. ఈ మొక్క పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతోపాటు వీర్యం కూడా చక్కగా తయారవుతుంది. ఇది సంతానం కలిగే అవకాశాలను మెరుగు పరుస్తుంది. అలాగే ఈ మొక్కను ఉపయోగిస్తే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
విదారిగంధ మొక్క వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే తీవ్రమైన అలసట, నీరసం అన్నీ తగ్గిపోతాయి. ఇలా ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు వాడుకోవాలి. ఈ మొక్క వేర్లకు సంబంధించిన పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. దీన్ని ఆయా వ్యాధులను నయం చేసుకునేందుకు ఉపయోగించవచ్చు. కానీ డాక్టర్ సూచన మేరకు వాడుకోవడం ఉత్తమం. లేదంటే దుష్పరిణామాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఉపయోగించడంలో జాగ్రత్తలు తప్పనిసరి.