Thotakura : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. పూర్వకాలంలో చాలా మంది తోటకూరను పెంచి మరీ తినే వారు. కానీ ప్రస్తుత కాలంలో రుచికరమైన భోజనానికి అలవాటు పడి దీన్ని తినడమే చాలా మంది మానేశారు. కానీ తోటకూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తోటకూరను తినడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తోటకూర మలబద్దకాన్ని తగ్గించి, ఆకలిని పెంచుతుంది. ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తోటకూరలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి, మిటమిన్ ఇ , విటమిన్ కె లతోపాటు కాల్షియం, పొటాషియం, జింక్, ఐరన్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. కొందరికి పాలు జీర్ణం అవ్వక శరీరానికి కావల్సిన కాల్షియం లభించదు. అలాంటి వారు తోటకూరను తినడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం లభిస్తుంది.
మధుమేహ వ్యాధి గ్రస్తులకు తోటకూర చక్కని ఔషధంలా పని చేస్తుంది. తోటకూర నెమ్మదిగా జీర్ణమవుతుంది. కనుక దీని ద్వారా వచ్చే గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. తోటకూరను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి తరచూ రోగాల బారిన పడకుండా ఉంటాం. అంతేకాకుండా దంతాలు, చిగుళ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గడంలో కూడా తోటకూర మనకు ఎంతో సహాయపడుతుంది. శరీరంలో ఉండే కొవ్వును కరిగించి మనం బరువు తగ్గేలా చేయడంలో తోటకూర మనకు ఉపయోగపడుతుంది.

తోటకూర ఆకులను జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్యతోపాటు ఇతర జుట్టు సమస్యలన్నీ నివారించబడతాయి. శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా తోటకూర మనకు దోహదపడుతుంది. ఒక్క తోటకూరను తింటే చాలు మన శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. ఈ తోటకూరను వేపుడుగా కంటే కూరగా చేసుకుని తినడం వల్లే మన శరీరానికి ఎక్కువగా పోషకాలు లభిస్తాయని, దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని.. నిపుణులు చెబుతున్నారు.