Billa Ganneru : మన చుట్టూ అనేక రకాల పూల మొక్కలు ఉంటాయి. వీటిలో కొన్ని మొక్కలు అందమైన పూలతో పాటు ఔషధ గుణాలను కూడా ఉలిగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో బిళ్ల గన్నేరు మొక్క కూడా ఒకటి. ఈ మొక్కను ఇంటి పెరట్లో, ఇంటి ముందు పెంచుకుంటూ ఉంటారు. మనకు వివిధ రంగుల పూలు పూసే బిళ్ల గన్నేరు మొక్కలు లభ్యమవుతాయి. ఈ మొక్కను సంస్కృతంలో నిత్యకళ్యాణి అని పిలుస్తారు. సంవత్సరం పొడవునా పూలు పూసే ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. బిళ్ల గన్నేరు మొక్క ఆకులు, పూలు, వేర్లను ఉపయోగించి పలు రకాల రోగాల బారి నుండి బయటపడవచ్చు. బిళ్లగన్నేరు మొక్క వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో ఉండే అనేక రుగ్మతలను నయం చేయడంలో ఈ మొక్కను చాలాకాలం నుండి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. బిళ్ల గన్నేరు మొక్క ఆకులకు గాయాలను నయం చేసే శక్తి ఉంటుంది. ఈ మొక్క ఆకులను మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని గాయాలు, పుండ్ల వంటి వాటిపై ఉంచడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి. ఈ మొక్క పూలను, దానిమ్మ పూలను సమానంగా తీసుకుని వాటి నుండి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని రెండు చుక్కల మోతాదులో ముక్కులో వేయడం వల్ల ముక్కు నుండి రక్తం కారడం ఆగుతుంది.
బిళ్ల గన్నేరు మొక్క ఆకుల నుండి తీసిన రసాన్ని విష కీటకాలు కుట్టిన చోట వేయడం వల్ల కొంతవరకు విష ప్రభావం తగ్గుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి బిళ్ల గన్నేరు మొక్క వేరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క వేరును సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదుగా తేనెతో కలిపి తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలోకి వస్తుంది లేదా ఈ మొక్క ఆకులను పరగడుపున నమిలి తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. బిళ్ల గన్నేరు మొక్క ఆకులను, వేప ఆకులను సమానంగా తీసుకుని ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తగినంతగా తీసుకుని దానికి కొద్దిగా పసుపును కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవడం వల్ల మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.
ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా పూల రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడితోపాటు నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుంది. బిళ్ల గన్నేరుకు క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం కూడా ఉంటుంది. ఈ మొక్క ఆకుల రసాన్ని తాగడంతోపాటు వేర్ల పొడితో డికాషన్ ను చేసుకుని రోజూ తాగడం వల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే స్త్రీలు బిళ్ల గన్నేరు మొక్క ఆకులను ఆరింటిని తీసుకుని రెండు కప్పుల నీటిలో వేసి అర కప్పు నీరు మిగిలే వరకు మరిగించాలి. ఈ నీటిని వడకట్టుకుని తాగడం వల్ల అధిక రక్తస్రావం సమస్య తగ్గుతుంది. ఈ విధంగా బిళ్ల గన్నేరు మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.