ఇంత చిన్న శిక్ష సమంజసమేనా? అని సూటిగా ప్రశ్నిస్తే జవాబు చెప్పడం చాలా కష్టం. కానిస్టేబుల్ కొడుకుగా జీవితం ప్రారంభించి అంచలంచెలుగా పదివేల కోట్ల ఆర్థిక సామ్రాజ్యానికి అధిపతి కాగలిగిన గాలి జనార్దన్ రెడ్డి చేసిన మహా నేరం ఏమీ లేదు, సింపుల్ గా గాలిలో మేడలు కట్టి ఆచరణలో విలువైన భూమిని తవ్వి పారేశాడు…అంతే. దానికి మహా ఘనత వహించిన మన రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, పాక్షికంగా న్యాయ వ్యవస్థలు సహకరించాయి, అంటే పంచ భూతాల్లో గాలి ని మినహాయించి మిగతావి అన్ని వెన్ను కాచాయి అని అనుకోవాలి, అతను చేసిన నేరం ఏమంటే…. కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్ అని ఒక ఉక్కు పరిశ్రమని భారీ స్థాయిలో నిర్మిద్దామనుకున్నాడు, 2006 లో ఏపీ కి సీఎం గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి అండదండలు అతనికి పుష్కలంగా లభించాయి.
దాంతో ఎకరా ₹ 18 వేల 500 చొప్పున ధరతో 10 వేల 670 ఎకరాలు అనగా 43.2 కిలోమీటర్ల పరిధి భూమి కేటాయించారు, స్టీల్ ప్లాంటు కు అవసరమైన ఇనుప ఖనిజం గనులు కర్ణాటక, ఏపీ సరిహద్దులో తగినంత ఉన్నాయి, వాటిని తవ్వి పోసి ఇతను తల పెట్టిన ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఉపయోగించాలి ( Captive mining) అనేది షరతు. అయితే ఈలోగా చైనాలో అక్కడి ప్రభుత్వం దేశంలో భారీగా వంతెనలు, ఫ్లైఓవర్స్, రైల్వే లైన్లు, ఇంటి నిర్మాణాలు మొదలు పెట్టింది, ఇంకేముంది? లెక్క లేనంత ఉక్కు అవసరమయ్యింది, ప్రపంచం లో ఉన్న ఎక్కడెక్కడి ఇనుప రజను దుమ్ము ని కొనడం మెదలు పెట్టారు. మన గాలి గారికీ జాక్ పాట్ దొరికి నట్టయింది, చైనా నిర్మాణ సంస్థ లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఇక్కడ రేయింబవళ్ళు శ్రామికుల్ని పెట్టి కొండల్ని పిండి చేశాడు, వేలాది ట్రక్కులకు ఇనుప ఖనిజం మట్టిని ఎత్తి నెల్లూరు జిల్లాలో కృష్ణ పట్నం , చెన్నై రేవుల ద్వారా చైనాకు నౌకల్లో లక్షల టన్నుల్లో రవాణా చేయించాడు.
ఈ ట్రక్కుల రవాణా తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే…బళ్ళారి ఏరియా నుంచి బయల్దేరిన అసంఖ్యాక ట్రక్కులు నిర్విరామంగా కడప జిల్లా గుండా నెల్లూరు జిల్లాకు చేరే మార్గంలో రోడ్లన్ని తుక్కు తుక్కు అయ్యాయి. వీటి ధాటికి తట్టుకోలేని గ్రామీణ ప్రాంతాల ప్రజలు హాహా కారాలు చేశారు, ఊళ్ళన్నీ దుమ్ము ధూళి కి ఉక్కిరిబిక్కిరి అయ్యాయి, అప్పట్లో జరిగిన ధర్నాలు పత్రికల్లో వార్తలుగా వచ్చాయి, అయితేనేం? గాలికి ప్రభుత్వాధినేత అగ్ని తోడైతే ఇక చెప్పేది ఏముంది? ఎవరు పట్టించుకుంటారు? ఈ లోగా బ్రాహ్మణి స్టీల్స్ కు సంబంధించి టౌన్ షిప్ , భారీ యంత్ర సామగ్రి సిద్ధమయ్యాయి, ఈ హంగామా చూపించి స్టీల్ ప్లాంటు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి అన్నట్టు బిల్డ్ అప్ ఇచ్చారు , బ్యాంకులు, ఆర్థిక సంస్థలు వేల కోట్ల రుణాలు ఉదారంగా చేతిలో పెట్టాయి. అంతులేని ధనలక్ష్మి ఒక్కసారి చేతికి అందితే ఇక తరవాత స్టెప్పు రాజకీయ పలుకు బడేగా?
అప్పటి బీజేపీ నాయకత్వ పెద్దల ఆశీర్వాదాలు అడక్కుండానే లభించాయి, అదే అండతో గాలి ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్ర మంత్రి కూడా కాగలిగారు , వైఎస్ మరణానంతరం ఆయన పుత్రుడు జగన్ రెడ్డి కూడా గాలిపై అదే ఆప్యాయత, అభిమానం కనబరిచారు. ఇక ప్రస్తుతానికి వస్తే.. గాలి జనార్దన్ రెడ్డి బృందం ఇప్పటికే చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీ లుగా మూడున్నర ఏళ్లు గడిపారు, ఇక ఇప్పుడు మిగిలింది మరో మూడున్నర ఏళ్ళు, అది కాస్తా ఇట్టే గడిచి పోతుంది, ఇంకా బోలెడు వయస్సు ఉంది. పైకి అలా కనిపిస్తాడు గానీ, గాలి గారు బహు ధార్మిక చింతనాపరుడు, అనేక దేవాలయాలకు భూరి విరాళాలు ఇచ్చిన అభినవ కర్ణుడు, వేల మంది పేద పిల్లలకి ఉచితంగా పెళ్ళిళ్ళు చేశాడు, దేవతా మూర్తులకు కిరీటాలు, ఇతర ఆభరణాలు చేయించాడు . ఇంటిలో శ్రీవారు కూర్చోడానికి స్వర్ణ సింహాసనం ఉంటుందని అంటారు, నీ ఇల్లు బంగారం కానూ అన్నట్టు చాలా వస్తువులు బంగారంతో చేయించుకున్నాడని చెబుతారు, ఇక నివాస గృహం అయితే రాయల నాటి ప్యాలెస్ తో పోటీ పడుతుంది.
సొంత హెలికాప్టర్ అయితే ఉంది, కుమార్తె వివాహాన్ని న భూతో న భవిష్యతి అన్నట్టు ధూం ధాం గా చేశారు, అందుకే తనని ఇంతటితో వదిలేస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ శేష జీవితం గడిపేస్తానని జడ్జి గారిని వేడుకున్నాడు. జైలు నుంచి విడుదలై వచ్చిన తరవాత విజృంభించి గాలి 2.0 ఎపిసోడ్ నిక్షేపంగా మొదలు పెట్ట వచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, అయితే ప్రజల కి చెందాల్సిన వేల కోట్ల విలువైన ప్రకృతి సంపద మాటేమిటి? మైనింగ్ పేరుతో పబ్లిగ్గా దోచేసిన నేరస్థ పెద్ద మనుషుల నుంచి వారి వద్ద మిగిలిన దాన్నయినా రికవరీ చేయడం ఎలాగో ఈ తీర్పు చెప్పిన న్యాయ వ్యవస్థే తేల్చాలి.