మోదీ ప్రధానిగా మొదటి సారి అధికారం చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు ఇప్పటికీ అనేక మందికి గుర్తుంటుంది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000, రూ.1000, రూ.500 నోట్లను మార్చుకునేందుకు పెద్ద సంఖ్యలో రహదారులపై బ్యాంకుల వద్ద బారులు తీరారు. అయితే పెద్ద నోట్ల రద్దు ఉద్దేశం మంచిదే అయినా ప్రధాని మోదీ ఆశించింది నెరవేరలేదనే చెప్పాలి. ఈ నోట్ల రద్దుతో భారీ ఎత్తున నల్లధనం బయటకు వస్తుందని ఆశించారు. కానీ నల్ల ధనాన్ని కూడా బ్యాంకుల సహకారంతో కొందరు మార్చుకున్నారు. దీంతో మోదీ అనుకున్నది నెరవేరలేదు. కానీ దేశ రక్షణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు మోదీని చాలా మంది అభినందించారు.
ఇక ఇప్పుడు మోదీ మరోసారి ప్రధాని అయ్యారు. మూడో సారి బీజేపీకి మెజార్టీ రాలేదు. దీంతో ఎన్‌డీఏ మిత్ర పక్షాల సహకారంతో అధికారంలోకి వచ్చింది. అయితే మోదీకి ప్రధానిగా ఇదే చివరిసారని కొందరు అంటున్నారు. మళ్లీ తరువాత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే కొత్త ముఖం కనిపించాల్సిందేనని, మోదీ ప్రభావం తగ్గుతుందని, కనుక ఎన్‌డీఏ మళ్లీ రావాలంటే ఈసారి కొత్త ముఖాన్ని ప్రధానిగా ప్రకటించాలని అంటున్నారు. ఈ క్రమంలోనే మోదీకి అత్యంత సన్నిహితంగా మెలిగే అమిత్ షా పేరుతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పేరు కూడా ఈ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోంది.
అయితే మోదీ, అమిత్ షా సమకాలీకులు. అందువల్ల ఇద్దరూ వయో భారంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో వీరు ప్రధాని రేసులో ఉండకపోవచ్చని సమాచారం. కానీ ఎన్‌డీఏ గనక మళ్లీ అధికారంలోకి వస్తే వీరు కేంద్ర మంత్రులు అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. ఇక ప్రధాని రేసులో యూపీ సీఎం యోగి పేరును పదే పదే ప్రస్తావిస్తున్నారు. దీంతో ఎన్‌డీఏ గనక మళ్లీ వస్తే యోగి ప్రధాని అవుతారంటూ బీజేపీ శ్రేణులు ఇప్పటికే అంతర్గతంగా ప్రచారం చేస్తున్నాయి. మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.