Amla Juice On Empty Stomach : ఉసిరికాయల గురించి అందరికీ తెలిసిందే. వీటిని ఇండియన్ గూస్‌బెర్రీ అని పిలుస్తారు. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రిఫలాల్లో ఉసిరి కూడా ఒకటి. దీన్ని అనేక ఔషధాలను తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. అనేక రోగాలను నయం చేసేందుకు ఆయుర్వేద వైద్యులు ఉసిరిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఉసిరి మనకు కేవలం శీతాకాలంలో మాత్రమే లభిస్తుంది. అయితే ప్రస్తుతం మనకు ఉసిరి అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. సూపర్ మార్కెట్‌లలోనూ దీన్ని ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఇక ఉసిరికాయ జ్యూస్ కూడా మనకు ఎప్పుడైనా సరే లభిస్తుంది. ఈ క్రమంలోనే చాలా మంది ఉసిరికాయ జ్యూస్‌ను ఉదయాన్నే తాగుతుంటారు. ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల మనం ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.
ఉసిరికాయ జ్యూస్ శరీరాన్ని శుభ్రం చేసే డిటాక్సిఫయింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కనుక దీన్ని రోజూ ఉదయాన్నే తాగితే శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది. ముఖ్యంగా లివర్, జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతాయి. ఆయా అవయవాలలో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. లివర్ వ్యాధులు ఉన్నవారికి ఉసిరికాయ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు ఉసిరికాయ జ్యూస్‌ను తాగడం మంచిది. దీంతో విరేచనాలు, మలబద్దకం, అజీర్తి తగ్గుతాయి. ఉసిరికాయ జ్యూస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. అలాగే సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా ఉసిరికాయ జ్యూస్‌తో మనం ప్రయోజనాలను పొందవచ్చు.
అయితే ఉసిరికాయ జ్యూస్ బాగా పుల్లగా ఉంటుంది. కనుక దీన్ని ఉదయం పరగడుపున తాగడం మంచిదేనా.. అని కొందరు సందేహిస్తుంటారు. ఇందుకు ఆయుర్వేద వైద్య నిపుణులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఉసిరికాయ జ్యూస్ పుల్లగా ఉంటుంది. కనుక దీన్ని పరగడుపునే తాగితే కొందరిలో అసిడిటీ, కడుపులో మంట వంటివి కలిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు ఉసిరికాయ జ్యూస్‌ను తీసుకోవాలి. అలాగే ఉసిరికాయ జ్యూస్‌లో అధికంగా ఉండే యాసిడ్లు పొట్టలోని మ్యూకస్ పొరపై ప్రభావం చూపించగలవు. దంతాల ఎనామిల్‌ను కూడా దెబ్బ తీయగలవు. కనుక ఈ జ్యూస్‌ను దంతాలకు తగలకుండా తాగాలి. అలాగే ఈ జ్యూస్‌లో నీళ్లు కలిపి తాగాలి. దీంతో యాసిడ్ల ప్రభావం తగ్గుతుంది. ఇలా ఉసిరికాయ జ్యూస్‌ను జాగ్రత్తలు తీసుకుని తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చు.