బెల్లంను రోజూ తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. భోజనం చేశాక బెల్లం తింటే జీర్ణప్రక్రియకు సహకరిస్తుంది. బెల్లంలో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల శరీరానికి పోషణ లభిస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లంను తినవచ్చా, వద్దా ? అని చాలా మంది సందేహిస్తుంటారు. మరి దీనికి వైద్యులు ఏమని సమాధానం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
చక్కెర, బెల్లం.. రెండూ ఒకే పదార్థం నుంచి తయారవుతాయి. వాటి ద్వారా దాదాపుగా సమానమైన క్యాలరీలు లభిస్తాయి. రెండింటి గ్లైసీమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. కానీ చక్కెరను శుద్ధి ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. బెల్లంను సహజసిద్ధంగా తయారు చేస్తారు. అందువల్ల బెల్లంలో పోషకాలు అలాగే ఉంటాయి. కనుక ఆరోగ్యం పరంగా పోలిస్తే చక్కెర కన్నా బెల్లమే మంచిదని చెప్పవచ్చు.
ఇక డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లంను వాడుకోవచ్చు. కానీ పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువైతే బెల్లం కూడా సమస్యలను కలగజేస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు చక్కెరకు బదులుగా బెల్లంను ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు. కానీ తక్కువ మోతాదులో తీసుకుంటేనే ఫలితం ఉంటుంది.
ఇక ముదురు గోధుమ రంగులో ఉండే బెల్లం మంచిది. అత్యంత సహజసిద్ధమైన పద్ధతిలో తయారు చేస్తే బెల్లంకు ఈ రంగు వస్తుంది. కనుక దాన్ని తీసుకోవాలి. మిగిలిన ఏ రంగులో ఉండే బెల్లంను అయినా తినకూడదు. వాటిల్లో రసాయనాలు కలిసి ఉంటాయి. కనుక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఆరోగ్యవంతులు కూడా బెల్లంను ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. దీని వల్ల జీర్ణసమస్యలు ఉండవు. శ్వాసకోశ వ్యవస్థ శుభ్రమవుతుంది. ఇంకా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.