Fermented Foods : మనం ఇడ్లీ, దోశ, పుల్లట్టు వంటి వాటిని తయారు చేసుకుని తింటూ ఉంటాం. వీటిని తయారు చేయడానికి పిండిని పులియబెడుతూ ఉంటాం. అలాగే చల్ల పునుగులు, మైసూర్ బజ్జీ , ఊతప్పం వంటి అనేక రకాల వంటకాలను మనం పులియ బెట్టి తయారు చేస్తూ ఉంటాం. అసలు పులిసిన ఆహారాలు మనకు మేలు చేస్తాయా, కీడు చేస్తాయా, అతిగా పులవడం అనారోగ్యానికి దారి తీస్తుందా.. అసలు ఎందుకు పులుస్తాయి.. పులిసినప్పుడు ఎటువంటి రసాయనాలు విడుదల అవుతాయి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే ఆహార పదార్థాల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ కు గాలిలో ఉండే బ్యాక్టీరియాలు చేరి ఈ కార్బోహైడ్రేట్స్ ను బ్యాక్టీరియాలు తమకు కావల్సిన రూపంలో మార్చుకుంటాయి. అలాగే ఈ కార్బోహైడ్రేట్స్ నుండి శక్తిని విడుదల చేసుకుని అవి బ్రతుకుతాయి.
ఇలా గాలిలో ఉండే బ్యాక్టీరియా ఆహార పదార్థాలకు చేరడం వల్ల అవి పులిస్తాయి. ఇలా మార్చుకునేటప్పుడు ఆక్సిజన్ అవసరం లేకుండా ఆహార పదార్థాలను శక్తిగా మార్చుకునే గుణం కొన్ని బ్యాక్టీరియాలకు ఉంటుంది. ఇలా ఆహార పదార్థాలను శక్తిగా మార్చుకునేటప్పుడు వ్యర్థాలు విడుదల అవుతాయి. బ్యాక్టీరియాలు కార్బోహైడ్రేట్స్ ను శక్తిగా మార్చుకునేటప్పుడు ఆల్కహాల్, గ్లిజరాల్, కార్బన్ డై యాక్సైడ్, లాక్టిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ వంటి కొన్ని రకాల వ్యర్థాలు పులిసేటప్పుడు విడుదల అవుతాయి. పులిసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి లాభాన్ని కలిగించే మరియు నష్టాన్ని కలిగించే వాటిని కూడా అందించిన వాళ్లం అవుతాము. పులిసిన పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి కొన్ని రకాల మంచి బ్యాక్టీరియాలు అందుతాయి. 5 నుండి 8 గంటల పాటు పులిసిన ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరానికి లాభం కలుగుతుంది. 8 గంటల పాటు పులియడం వల్ల ఆల్కాహాల్, లాక్టిక్ యాసిడ్ వంటివి తక్కువ మొత్తంలో విడుదల అవుతాయి.
వీటి వల్ల ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడంతో పాటు శరీరానికి కావల్సిన కొన్ని రకాల విటమిన్స్ అందుతాయి. ఇడ్లీ పిండి, దోశ పిండి వంటి వాటిని వారినికి సరిపడా తయారు చేసుకుని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేస్తూ ఉంటారు. ఇలా నిల్వ చేయడం వల్ల ఆహార పదార్థాలు అతిగా పులుస్తాయి. అతిగా పులిసిన ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. వీటిని తీసుకోవడం వల్ల ప్రేగుల్లో చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. అలాగే అతిగా పులిసిన ఆహారాలను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, అల్సర్లు వంటి సమస్యలు వస్తాయి. పులిసిన ఆహారాలను తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికి అతిగా పులిసిన ఆహారాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.