గుండె జబ్బులు ఉన్నవారికే కాదు, అవి లేని వారికి కూడా గుండె ఆరోగ్యం పట్ల అనేక సందేహాలు వస్తుంటాయి. ఫలానా ఆహారం తినాలా, వద్దా, ఏ నూనె వాడాలి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? వంటి అనేక ప్రశ్నలు మదిలో వస్తుంటాయి. అయితే అలాంటి ప్రశ్నలకు వైద్య నిపుణులు ఏమని సమాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
1. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ?
పిండి పదార్థాలు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. నూనె పదార్థాలను తగ్గించాలి. వారంలో కనీసం 5 రోజుల పాటు అయినా రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. అపార్ట్‌మెంట్లలో ఉండే వారు, పై అంతస్తుల్లో పనిచేసే ఉద్యోగులు లిఫ్ట్ వాడకుండా మెట్లను వాడితే మంచిది. ఎక్కువ సేపు కూర్చుని పనిచేసేవారు మధ్యలో కొంత సేపు పనికి విరామం ఇచ్చి కాసేపు అటు, ఇటు తిరగాలి. ధూమపానం, మద్యపానం మానేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. హైబీపీ, షుగర్ ఉన్నవారు వాటిని కంట్రోల్‌లో ఉంచుకోవాలి.
2. కొందరు ఆరోగ్యంగా కనిపించినా సడెన్‌గా గుండె పోటుతో చనిపోతుంటారు ? కారణం ఏమిటి ?
దీన్నే సైలెంట్ అటాక్ (కార్డియాక్ అరెస్ట్) అంటారు. 30 ఏళ్లకు పైబడిన వారు ఎప్పటికప్పుడు గుండె పరీక్షలు చేయించుకుంటే ఇలాంటి పరిణామాలు తలెత్తకుండా ఉంటాయి.
3. గుండె ఆరోగ్యం కోసం జాగింగ్ లేదా వాకింగ్, ఏది చేస్తే మంచిది ?
ఆరోగ్యంగా ఉన్నవారు ఏదైనా చేయవచ్చు. కానీ కీళ్ల సమస్యలు ఉన్నవారు వాకింగ్ చేయడం ఉత్తమం.
4. చేపలు తింటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందా ?
చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. అందువల్ల గుండెకు చేపలు మేలు చేస్తాయి. కానీ వాటిని అతిగా తీసుకోరాదు. చేపలను వేపుడుగా కన్నా కూరగా చేసుకుని తింటే మేలు.
5. గుండె జబ్బులు వంశ పారంపర్యంగా వస్తాయా ?
అవును. గుండె జబ్బులు వంశ పారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
6. హైబీపీ ఉంటే గుండె జబ్బులు వస్తాయా ?
వస్తాయి. కానీ ఆ అవకాశాలు తక్కువగా ఉంటాయి. బీపీని నియంత్రణలో ఉంచుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
7. కొలెస్ట్రాల్ సమస్య పెద్ద వారిలోనే ఉంటుందా ?
లేదు. యుక్త వయస్సులో ఉన్నవారిలోనూ కొలెస్ట్రాల్ అధికంగా ఉండవచ్చు. దానికి వయస్సుతో సంబంధం లేదు.
8. మందులు వాడకుండా కొలెస్ట్రాల్‌ను అదుపులో పెట్టలేమా ?
పెట్టవచ్చు. కానీ ఒకేసారి మందులను మానేయరాదు. డాక్టర్ల సూచన మేరకు పౌష్టికాహారం తీసుకుంటూ నెమ్మదిగా మందులను మానేయవచ్చు. కేవలం ఆహారంతోనే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని డాక్టర్లు నిర్దారిస్తే వారి సూచన మేరకు మందులను వాడడం మానేయవచ్చు.
9. గుండె జబ్బులు రాకుండా యోగా కాపాడుతుందా ?
అవును. యోగా చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు రావు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
10. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వంట నూనెల్లో ఏది ఉత్తమం ?
రీఫైన్డ్ అయిల్స్ అన్నీ ప్రమాదకరమైనవే. గానుగలో ఆడించిన నూనెలు అయితే ఉత్తమం.
11. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి ?
తాజా కూరగాయలు, పండ్లు, నట్స్ తినాలి. నూనె పదార్థాలు మానేయాలి. లేదా తక్కువగా తీసుకోవాలి.
12. తరచూ చేయించుకోవాల్సిన పరీక్షలు ఏమిటి ?
షుగర్, కొలెస్ట్రాల్, బీపీ, 2డీ ఎకో, ట్రెడ్‌మిల్ పరీక్షలను తరచూ చేయించుకోవాలి. దీని వల్ల ఏదైనా అసాధారణంగా అనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవచ్చు. లేదంటే గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
13. హార్ట్ ఎటాక్ రాగానే వ్యక్తికి ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలి ?
హార్ట్ ఎటాక్ వచ్చిన వారిని 60 నిమిషాల్లోగా హాస్పిటల్‌కు తరలించాలి. దాన్నే గోల్డెన్ అవర్ అంటారు. ఆ సమయంలోగా హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడకుండా ఉంటాయి. లేదంటే గుండెకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇక హాస్పిటల్‌కు తరలించే లోపు బాధితుడికి ప్రథమ చికిత్స చేయాలి. ముందుగా వ్యక్తిని పడుకోబెట్టాలి. తరువాత ఆస్పిరిన్ మాత్రను, దొరికితే సార్బిట్రేట్ మాత్రతోపాటు నాలుక కింద పెట్టాలి. శ్వాస ఆడకపోతే కృత్రిమ శ్వాస అందివ్వాలి. నోట్లో నోరు పెట్టి శ్వాసను అందించాలి. గుండెపై చేతులతో సున్నితంగా ఒత్తిడి కలిగిస్తూ సీపీఆర్ చేయాలి. దీని వల్ల గుండెకు నష్టం కలగకుండా ఉంటుంది.
14. గ్యాస్ నొప్పి, గుండె నొప్పి ఎలా కనిపెట్టాలి ?
ఈసీజీ చేయించుకుంటే తెలిసిపోతుంది.
15. గుండె ఆపరేషన్ తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?
ఆహార నియంత్రణ పాటించాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని వేళకు తీసుకోవాలి. రోజూ వ్యాయామం కచ్చితంగా చేయాలి. వేళకు మెడిసిన్ వేసుకోవాలి. వేళకు నిద్రించాలి. పొగతాగడం, మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. కొలెస్ట్రాల్, బీపీ, బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365