Chapatis : ప్రస్తుత తరుణంలో అధిక బరువు సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అధిక బరువు వల్ల అనేక మంది అవస్థలు పడుతున్నారు. అధిక బరువును తగ్గించేందుకు అనేక ప్రయత్నాలను చేస్తున్నారు. అందులో భాగంగానే రోజూ వ్యాయామం చేయడం, డైట్ పాటించడం వంటివి చేస్తున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు ఎవరైనా సరే సహజంగానే రోజూ రాత్రి పూట అన్నం తినడం మానేసి చపాతీలను తింటుంటారు. ఎందుకంటే చపాతీలు అయితే కేవలం 2 తింటే చాలు.. కడుపు నిండుతుంది. దీంతో ఎక్కువ ఆహారం తినలేము. ఇది బరువు తగ్గేందుకు సహాయ పడుతుంది.
అలాగే చపాతీల తయారీకి గోధుమ పిండిని వాడుతారు. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది కూడా కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. కనుక చపాతీలను రోజూ చాలా మంది తింటుంటారు. అయితే చపాతీల విషయానికి వచ్చే సరికి కొందరు వీటిని అతిగా తింటుంటారు. ఆరోగ్యకరమే కదా అని చెప్పి చాలా మంది నాలుగైదు చపాతీలను అలవోకగా తింటుంటారు. అయితే ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చపాతీలు బరువును తగ్గిస్తాయి. కానీ వీటిని అధికంగా తింటే బరువు తగ్గరు. బరువు పెరుగుతారు. అలాంటప్పుడు రోజూ రాత్రి పూట చపాతీలను తిన్నా ఒకటే. అన్నం తిన్నా ఒకటే. కనుక చపాతీలను తింటున్నవారు వాటిని అధికంగా లాగిస్తుంటే మాత్రం ఆ అలవాటును తప్పనిసరిగా మానుకోవాల్సిందే. లేదంటే బరువు తగ్గరు సరికదా.. బరువు పెరుగుతారు.
ఇక చపాతీలను రాత్రి పూట మరి ఎన్ని తినాలి ? ఎన్ని తింటే బరువు తగ్గవచ్చు ? అంటే.. రాత్రి పూట నూనె వేయకుండా పుల్కాల మాదిరిగా కాల్చిన చపాతీలు అయితే 2 చాలు. ఒక్కో చపాతీ ద్వారా మనకు 70 క్యాలరీలు లభిస్తాయి. అంటే 2 చపాతీలకు 140 క్యాలరీలు అన్నమాట. ఇవి రాత్రి పూట మనకు సరిపోతాయి. కనుక శరీరంలో కొవ్వు చేరదు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
అయితే బరువు తగ్గాలంటే రాత్రి పూట మాత్రమే కాకుండా మధ్యాహ్నం సమయంలోనూ అన్నం కాకుండా చపాతీలనే తినాలి. అప్పుడు కూడా కేవలం 2 చపాతీలను తినాలి. దీంతో క్యాలరీలను తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా శరీరం శక్తి కోసం గ్లూకోజ్ మీద కాకుండా కొవ్వు మీద ఆధారపడుతుంది. అప్పుడు కొవ్వు వేగంగా కరుగుతుంది. దీంతో బరువు సులభంగా తగ్గుతారు. ఇలా చపాతీలను మధ్యాహ్నం 2, రాత్రి 2.. మొత్తం కలిపి రోజుకు 4 తినడం ద్వారా సులభంగా.. వేగంగా.. అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు ఈ తరహా డైట్‌ను పాటిస్తే.. కచ్చితంగా బరువు తగ్గుతారు. తప్పక ఫలితం ఉంటుంది. కాబట్టి చపాతీలను మితంగా తినండి.. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందండి.