Milk : బరువు తగ్గాలనుకునే వారు చాలా రకాల ఆహారాలను దూరం పెడుతూ ఉంటారు. వాటిలో ఒకటి పాలు. కానీ పాలు తాగడం వలన నిజంగా బరువు పెరుగుతారా లేదా అనేది ఇప్పటికీ చాలా మందికి సందేహంగానే ఉంటుంది. పాలు అనేవి కచ్చితంగా ఆరోగ్యానికి మేలు చేసేవే అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పాలలో ఉండే సూక్ష్మ పోషకం అయిన ఫ్యాట్ బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. కానీ బరువు తగ్గడానికి డైట్ చేసేవారు తప్పనిసరిగా పాలు తాగకూడదా లేదా అనే విషయాలు చర్చించాల్సి ఉంది.
అయితే వాస్తవానికి పాలు అనేవి బరువు పెరగడానికి కారణం కావని ఒక విధంగా అవి బరువు తగ్గడంలో దోహదం చేస్తాయని డైటీషియన్ల అభిప్రాయం. పాలలో కండరాల నిర్మాణానికి, పెరుగుదలకి అవసరమైన నాణ్యమైన ప్రొటీన్లు ఉంటాయి. అంతే కాకుండా జింక్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలను బలంగా చేయడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియలను మెరుగు పరచడానికి అవసరమవుతాయి. 250 మి.లీ ల పాలలో 125 మి.గ్రా ల కాల్షియం ఉంటుంది. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి పాలను కొద్ది మోతాదులో రోజూ తీసుకోవడం వలన డైటింగ్ చేసే వారికి ఎటువంటి ఇబ్బంది రాదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
సమతుల ఆహారంలో పాలు అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. అందు వలన బరువు తగ్గాలనుకునేవారు పాలను దూరం పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే పాలోల ఉండే ఫ్యాట్ గురించి ఆలోచించే వారు తక్కువ ఫ్యాట్ ఉండే పాలను లేదా మొక్కల ఆధారిత గింజల నుండి తీసే పాలను ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే పాలను ఏ సమయంలో తాగాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటిని ఉదయం సమయంలో తాగడంమే మంచిదని చెబుతున్నారు.
అలాగే ఖాళీ కడుపుతో గానీ, జీర్ణక్రియలో ఇబ్బందులు ఉన్నవారు తాగకూడదని హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయంలో లేదా భోజనం చేసిన వెంటనే తాగడం వలన కూడా అరుగుదల సమస్యలు వస్తాయి. కాబట్టి గోరు వెచ్చని పాలను భోజనం తరువాత కనీసం ఒక గంట తరువాతనే తాగాలని చెబుతున్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని తాగడం వలన ఎటువంటి సమస్యలు రాకుండా పాల నుండి వచ్చే ప్రయోజనాలను పొందవచ్చు.