అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక మంది రకరకాల డైట్‌లను పాటిస్తుంటారు. ఇక చాలా మంది అన్నం తింటే బరువు తగ్గమేమోనని భావించి దానికి బదులుగా వేరే పదార్థాలను తింటుంటారు. అయితే నిజానికి బరువు తగ్గడం కోసం అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. కొద్దిగా తీసుకోవచ్చు. అన్నాన్ని రోజూ కొద్ది మోతాదులో తింటూనే బరువును తగ్గించుకోవచ్చని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
అన్నం అంటే పాలిష్ చేయబడిన బియ్యంతో తయారు చేస్తారు. కనుక అందులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో అన్నాన్ని తింటే బరువు పెరిగేందుకు చాన్స్ ఉంటుంది. అది నిజమే. అయితే అంత మాత్రం చేత అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. రోజూ తినే అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన పనిలేదు. చాలా తక్కువ మొత్తంలో అన్నం తినవచ్చు. ఇలా చేసినా బరువు తగ్గుతారు.
అయితే అన్నం తింటూనే బరువు తగ్గాలంటే అందులో తినే కూరలు, పప్పు వంటి వాటి పరిమాణాన్ని పెంచాలి. అంటే.. అన్నం తక్కువగా.. కూరలను ఎక్కువగా తినాలన్నమాట. దీంతో బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
ఇక భోజనం చేసేందుకు అర గంట ముందు కీరదోస, క్యారెట్, బీట్‌రూట్, జామకాయ వంటివి తినాలి. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. అన్నం తక్కువగా తింటాం. అంతేకాదు, ఆయా పదార్థాలు జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది కనుక ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇలా అధిక బరువును తగ్గించుకోవచ్చు.
ఇక అన్నం తినే సమయంలో మంచి నీళ్లను తాగరాదు. భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేశాక 30 నిమిషాలు ఆగి నీటిని తాగాలి. భోజనం చివర్లో కొద్దిగా పెరుగు లేదా మజ్జిగను కొద్దిగా అన్నంలో కలుపుకుని తినాలి. దీంతో కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారు పై విధంగా అన్నాన్ని కొద్ది మోతాదులో తింటూనే బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇక అధిక బరువు తగ్గేందుకు గ్రీన్ టీ కూడా పనిచేస్తుంది. రోజుకు రెండు సార్లు గ్రీన్ టీని తాగితే కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.
బరువు తగ్గాలంటే రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి కూడా చేయవచ్చు. చక్కెర, నూనె పదార్థాల వాడకం తగ్గించాలి. ఇలా చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది.