ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల పొడిని సమాన భాగాల్లో తీసుకుని కలిపి తయారు చేసే మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీని గురించి చాలా మందికి తెలుసు. కానీ ఎలా వాడాలో తెలియదు. అయితే త్రిఫల చూర్ణం అనేక సమస్యలకు పనిచేస్తుంది.
మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి సమస్యలు ఉన్నవారు ఒక గ్లాస్ మజ్జిగలో ఇంగువ, త్రిఫల చూర్ణంలను కొద్ది కొద్దిగా వేసి తీసుకోవాలి. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం ఉండవు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
ఇక త్రిఫల చూర్ణాన్ని పలు ఇతర అనారోగ్య సమస్యలకు కూడా ఉపయోగించవచ్చు. దీన్ని ప్రత్యక్షంగా తీసుకోరాదు. నీళ్లు, మజ్జిగ, తేనె వంటి పదార్థాలతో కలిపి తీసుకోవాలి. దీంతో శరీరంలో శ్లేష్మం, పైత్యం తగ్గుతాయి. చర్మవ్యాధులు నయం అవుతాయి. తరచూ ఈ చూర్ణాన్ని తీసుకుంటే శరీరంలోని క్రిములు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ త్రిఫల చూర్ణం వేసి బాగా కలిపి మరిగించి భోజనానికి అర గంట ముందు తీసుకోవాలి. అజీర్తి, కడుపులో మంటతో బాధపడేవారు పెరుగులో ఈ చూర్ణాన్ని కలిపి 3, 4 వారాల పాటు తీసుకోవాలి. ఫలితం కనిపిస్తుంది. త్రిఫల చూర్ణాన్ని నెయ్యి లేదా తేనెతో కలిపి తీసుకుంటే నేత్ర సమస్యలు ఉండవు.
తిప్పతీగ రసంలో త్రిఫల చూర్నం కలిపి తీసుకుంటే జ్వరం, మూత్ర సమస్యలు తగ్గుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ చూర్ణాన్ని రోజూ తేనెతో తీసుకోవాలి. దీంతో ఐరన్ బాగా లభిస్తుంది. రక్తం బాగా తయారవుతుంది. త్రిఫల చూర్ణంతో చేసే కషాయాన్ని పుక్కిలించడం వల్ల నోటిపూత, దంతాల సమస్యలు, చిగుళ్ల వాపులు, నోటి దుర్వాసన వంటి సమస్యలు తగ్గుతాయి. జుట్టు రాలే సమస్య ఉన్న వారు త్రిఫల చూర్ణాన్ని పెరుగులో కలిపి తింటే ఫలితం ఉంటుంది. త్రిఫల చూర్ణంలో కుంకుడు కాయలు, మందార చెట్టు ఆకులు, మెంతుల పొడి కలిపి తలకు బాగా మర్దనా చేసి తలస్నానం చేస్తే జుట్టు సమస్యలు ఉండవు. చుండ్రు తగ్గుతుంది.
త్రిఫల చూర్ణాన్ని 3 నుంచి 6 నెలలకు మించి వాడకూడదు. అలాగే విరేచనాలు అయిన వారు దీన్ని తీసుకోరాదు. ఆ సమస్య తగ్గాక తీసుకోవచ్చు. ఇక దీన్ని చాలా స్వల్ప మోతాదులో వాడాలి. ఎక్కువగా వాడితే అనారోగ్య సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365