వేసవి కాలంలోనే లభించే మామిడి పండ్లను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మామిడి పండ్లలో అనేక రకాలు ఉంటాయి. రసాలు, కోత మామిడి.. ఇలా అనేక రకాల మామిడి పండ్లు మనకు లభిస్తాయి. అయితే మామిడి పండ్లను తినేందుకు కొందరు సంశయిస్తుంటారు. వాటిని తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని భావిస్తుంటారు. కానీ మామిడి పండ్లను రోజూ తగిన మోతాదులో తింటే ఏమీ కాదు. ఈ క్రమంలోనే మామిడి పండ్లను తినడంలో కొందరికి ఉండే అపోహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మామిడి పండ్లను తింటే అధిక బరువు పెరుగుతారు ?
మామిడి పండ్లను తింటే బరువు అధికంగా పెరుగుతారని భయపడతారు. కానీ ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. మనం తినే జంక్ ఫుడ్, నూనె పదార్థాల కారణంగానే మనం బరువు పెరుగుతాం. వ్యాయామం చేయకపోయినా, అతిగా ఆహారం తిన్నా బరువు పెరుగుతాం. నిజానికి మామిడి పండ్లను తింటే బరువు పెరగరు. బరువు తగ్గుతారు. ఈ పండ్లలో విటమిన్ ఎ, సి, ఐరన్, పొటాషియం, కాపర్ తదితర పోషకాలు ఉంటాయి. ఇవి అధిక బరువు తగ్గేందుకు సహాయ పడతాయి. ఆకలిని నియంత్రణలో ఉంచుతాయి. దీంతో బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.
2. మామిడి పండ్లను తింటే మొటిమలు, మచ్చలు వస్తాయి ?
విటమిన్ ఎ లోపించినా, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే ఆహారాలను తీసుకోకపోయినా, మినరల్స్ లోపం ఏర్పడినా మొటిమలు, మచ్చలు వస్తాయి. అంతేకానీ మామిడి పండ్లను తినడం వల్ల అవి రావు. పైగా ఈ పండ్లను తింటే కెరాటిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది.
3. డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లను తినరాదు ?
డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లను తినరాదని అనుకుంటుంటారు. కారణం.. అవి తియ్యగా ఉంటాయని వారు ఆ పండ్లను తినరు. కానీ వాటి గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ తక్కువే. కనుక వాటిని నిర్భయంగా తినవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరగవు. కానీ ఈ పండ్లను తగిన మోతాదులో తీసుకోవాలి. అతిగా తినరాదు. మామిడి పండ్లలో ఉండే మాంగిఫెరిన్ అనే సమ్మేళనం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కనుక డయాబెటిస్ ఉన్నవారు ఎలాంటి జంకు లేకుండా ఈ పండ్లను తినవచ్చు.
4. మామిడి పండ్లను తింటే వేడి చేస్తుంది ?
అవును. ఇది మాత్రం నిజమే. మామిడి పండ్లను అతిగా తింటే వేడి చేస్తుంది. కానీ తగిన మోతాదులో తింటే ఏమీ కాదు. శరీరానికి మేలే జరుగుతుంది. అయితే మామిడి పండ్లను కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టి తింటే ఎన్నయినా తినవచ్చు. వేడి చేయదు. అలా అని చెప్పి కూడా మితిమీరి తినరాదు. సాధారణం కన్నా కొంచెం ఎక్కువ తినవచ్చన్నమాట.
5. గర్భిణీలు మామిడి పండ్లను తినరాదు ?
గర్భిణీలు మామిడి పండ్లను తినవచ్చు. కాకపోతే కొద్ది మోతాదులో తీసుకోవాలి. బాగా పండిన పండ్లనే తినాలి. స్వల్పంగా తీసుకుంటే ఏమీ కాదు. పైగా ఆ పండ్లలో ఉండే పోషకాలు తల్లికి, కడుపులో ఉండే బిడ్డకు ఎంతగానో మేలు చేస్తాయి.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365