కోడిగుడ్లను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్యులు చెబుతుంటారు. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లకు ఇవి ఉత్తమమైన వనరులు అని చెప్పవచ్చు. వీటిని ఉడికించడం చాలా సులభం. పైగా గుడ్లు తక్కువ ఖరీదునే కలిగి ఉంటాయి. అందువల్ల తక్కువ ఖర్చుతోనే వీటి ద్వారా పోషకాలను పొందవచ్చు. అందువల్ల రోజు వారీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవాలి. దీంతో అనేక పోషకాల లోపాన్ని భర్తీ చేయవచ్చు. అయితే కోడిగుడ్లను తినేందుకు సరైన సమయం ఏదో ఇప్పుడు తెలుసుకుందాం.
కోడిగుడ్లను ఉడికించేందుకు చాలా తక్కువ సమయం పడుతుంది. 10 నిమిషాల్లో గుడ్లను ఉడికించవచ్చు. అందువల్ల త్వరగా వీటిని ఆహారంగా తీసుకోవచ్చు. కోడిగుడ్లలో జింక్, మెగ్నిషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అందువల్ల గుడ్లను తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. పనిపై దృష్టి పెట్టవచ్చు. దీని వల్ల బరువును కూడా తగ్గించుకోవచ్చు.
ఉదయాన్నే వ్యాయామం చేసిన తరువాత గుడ్లను తినడం ఎంతో మేలు చేస్తుంది. వాటిని ఉడకబెట్టుకుని తినాలి. దీంతో కండరాల నిర్మాణం జరుగుతుంది. శరీరానికి శక్తి లభిస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనానికి మధ్య కూడా గుడ్లను తీసుకోవచ్చు.
రాత్రి పూట ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల నిద్ర చక్కగా పడుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే కొందరికి రాత్రి పూట గుడ్లను తింటే పడకపోవచ్చు. అలాంటి వారు ఉదయం లేదా మధ్యాహ్నం కోడిగుడ్లను తినవచ్చు. అయితే కోడిగుడ్లను ఆమ్లెట్ రూపంలో కన్నా ఉడకబెట్టి తింటేనే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. గుడ్లను తినేందుకు ఒక సమయం అని ఏమీ లేదు. ఎవరి సౌకర్యానికి తగినట్లు వారు తినవచ్చు. కానీ నిర్దిష్టమైన సమయంలో తింటే అనారోగ్య సమస్యలు వస్తాయనుకుంటే మాత్రం వాటిని ఇంకో సమయంలో తినాలి. రాత్రి పూట కాకుండా ఉదయం లేదా మధ్యాహ్నం వాటిని తినడం అన్నింటికన్నా ఉత్తమమైన సమయం అని చెప్పవచ్చు.