ప్రస్తుత తరుణంలో యుక్త వయస్సులో ఉన్న వారికి హార్ట్ ఎటాక్ లు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా టీవీ, సినిమా నటుడు సిద్ధార్థ్ శుక్లా హార్ట్ ఎటాక్ బారిన పడి చనిపోయాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రాత్రి పూట ఆరోగ్యం బాగా లేదని మెడిసిన్ వేసుకుని త్వరగా నిద్రపోయిన సిద్ధార్థ్ ఉదయం నిద్ర లేవలేదు. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు.
అయితే సిద్ధార్థ్ అప్పటికే మృతి చెందాడని, అతను నిద్రలోనే హార్ట్ ఎటాక్ కారణంగా చనిపోయాడని వైద్యులు తెలిపారు. అతని వయస్సు 40 ఏళ్లు. అది యుక్త వయస్సు కాదు. కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం 40 ఏళ్లు అంటే యుక్త వయస్సు కిందే పరిగణించాలి. ఈ క్రమంలోనే 20-40 ఏళ్ల మధ్య ఉన్నవారికి హార్ట్ ఎటాక్ లు ఎక్కువగా వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
అయితే ఈ విధంగా యుక్త వయస్సులో ఉన్నవారికి హార్ట్ ఎటాక్ లు ఎందుకు వస్తున్నాయనే విషయాలపై వైద్య నిపుణులు తగిన కారణాలు చెబుతున్నారు. అవేమిటంటే..
మద్యం సేవించడం, పొగ తాగడం, వేళకు భోజనం చేయకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిత్యం ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం.. వంటి అనేక కారణాల వల్ల యుక్త వయస్సులో ఉన్నవారికి హార్ట్ ఎటాక్ లు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం 20 నుంచి 30 ఏళ్ల వయస్సు ఉన్నవారికి డయాబెటిస్, హై కొలెస్ట్రాల్, హార్ట్ ఎటాక్ లు ఎక్కువగా వస్తున్నాయి. అందుకు వారు అవలంబిస్తున్న జీవనశైలే కారణమని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల దాన్ని పూర్తిగా మార్చుకోవాలని వారు సూచిస్తున్నారు. దేశంలో ఎక్కువ మంది యుక్త వయస్సులో ఉన్నవారు పైన తెలిపిన కారణాల వల్లే ఎక్కువగా చనిపోతున్నారని, వారికి డయాబెటిస్ లేదా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. కనుక ఇవి రాకుండా ఉండాలంటే ఎవరైనా సరే ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటించాల్సి ఉంటుంది.