దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే 75 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వేశామని కేంద్రం తాజాగా తెలిపింది. దీంతో ఈ ఏడాది చివరి వరకు యువత మొత్తానికి టీకాలు వేస్తామని కేంద్రం చెబుతోంది. అయితే కోవిషీల్డ్, కోవాగ్జిన్ తీసుకున్నాక 2 నెలల తరువాత యాంటీ బాడీలు తగ్గిపోతున్నాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.
కోవాగ్జిన్ 2 డోసులు తీసుకున్న తరువాత 2 నెలలకు, కోవిషీల్డ్ తీసుకున్న తరువాత 3 నెలలకు యాంటీ బాడీలు తగ్గిపోతున్నాయని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది. అయితే ఇది షార్ట్ టర్మ్ స్టడీ అని 6 నెలల తరువాత రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాలని సైంటిస్టులు తెలిపారు. అలాగే ఏడాది తరువాత టీకాల వల్ల యాంటీ బాడీలు ఉన్నాయా, లేదా అనే విషయం కూడా పరిశీలించాల్సి ఉంటుందని, అప్పుడే బూస్టర్ డోస్ గురించి ఆలోచించగలమని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ దేవదత్త్ భట్టాచార్య మీడియాతో మాట్లాడుతూ మొత్తం 614 మందిని ఈ అధ్యయనంలో భాగంగా పరీక్షించామని తెలిపారు. వారిలో కొందరు కోవాగ్జిన్ తీసుకోగా, కొందరు కోవిషీల్డ్ తీసుకున్నారు. అయితే కోవాగ్జిన్ తీసుకున్న వారిలో 2 నెలలకు, కోవిషీల్డ్ తీసుకున్న వారిలో 3 నెలలకు యాంటీ బాడీలు తగ్గడాన్ని గుర్తించామన్నారు. కానీ 6 నెలల తరువాత మళ్లీ స్టడీ చేసి వివరాలను తెలుసుకోవాలని, అప్పుడే బూస్టర్ షాట్ గురించి ఆలోచించవచ్చని అన్నారు.
కాగా దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాగ్జిన్‌తోపాటు స్పుత్‌నిక్ వి టీకాను కూడా ఇస్తున్నారు. వీటిని రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక జైడస్ కాడిలాకు చెందిన జైకోవ్-డిని 3 డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది.