పిల్లలకు చిన్నతనంలో తల్లిపాలు పడితే, వారి తర్వాతి జీవితంలో కొల్లెస్టరాల్ స్ధాయిలు తక్కువగా వుంటాయట. అంతే కాదు తల్లులకు బ్రెస్ట్ కేన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని కూడా ఒక అధ్యయనం చెపుతోంది. తల్లులందరూ తమ పిల్లలకు కనీసం ఆరు నెలలు వచ్చేటంతవరకు పాలుపడితే కొన్ని వేలమంది జీవితాలు గుండె నొప్పితో అంతమయ్యేవి కావని ఈ స్టడీ చెపుతోంది.
చిన్నతనంలోని తల్లిపాలు భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలను తగ్గిస్తాయని పరిశోధన చెపుతోంది. లండన్ లోని సెయింట్ జార్జ్ విశ్వవిద్యాలయ రీసెర్చర్లు 17,000 మంది వ్యక్తులను సర్వే చేయగా, ఇతర పాలు తాగిన వారికంటే కూడా తల్లిపాలు తాగిన వారికి కొల్లెస్టరాల్ తక్కువగా వున్నట్లు తేలింది.
చిన్నపుడు తల్లిపాలు తాగితే, పెద్దవారైన తర్వాత వారి కొల్లెస్టరాల్ స్ధాయి తక్కువగా వుండి గుండె సంబంధిత వ్యాధులు రావని, దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తల్లులు తమ పిల్లలకు చిన్నతనంలో పాలు పట్టాలని పరిశోధకుడు డా. క్రిస్ ఓవెన్ తెలిపినట్లు టెలిగ్రాఫ్ దిన పత్రిక ప్రచురించింది. తల్లిపాలు తాగిన పిల్లలకు అధిక బరువు, గజ్జి, చెవి సంబంధిత వ్యాధులు కూడా అతి తక్కువగా వస్తాయని స్టడీ తెలుపుతోంది. ఈ స్టడీ అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించబడింది.