Stop Smoking : పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది పొగ తాగుతుంటారు. కొందరు అయితే ఫ్యాషన్ కోసం స్మోక్ చేస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది యువత సిగరెట్లు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. అయితే ఇవి దీర్ఘకాలంలో చేటు చేస్తాయి. ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలగజేస్తాయి. పొగ తాగడం వల్ల ఆరోగ్యం అనేక రకాలుగా దెబ్బ తింటుంది. ఇది ప్రాణాంతక వ్యాధులను కలగజేస్తుంది.
పొగ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు 10 రెట్లు పెరుగుతాయి. కొందరు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం అనంతరం వెంటనే పొగ తాగుతారు. అలాంటప్పుడు కాల్చే ఒక సిగరెట్ 10 సిగరెట్లతో సమానమని సైంటిస్టుల అధ్యయనాల్లో సైతం వెల్లడైంది. ఇక పొగ తాగేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పొగ తాగేవారిలో రక్త నాళాలు పలుచగా మారుతాయి. దీంతో రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ ఏర్పడి రక్త సరఫరాకు అడ్డంకులను సృష్టిస్తుంది. దీంతో హైబీపీ వస్తుంది. ఫలితంగా అది హార్ట్ ఎటాక్‌కు దారి తీస్తుంది. కనుక ఎవరికైన పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానుకోవాలి. లేదంటే అది ఆరోగ్యాన్ని అన్ని విధాలుగా దెబ్బ తీస్తుంది.
ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది..
అయితే పొగ తాగడం మానేస్తే ఏమవుతుంది.. అన్న విషయంపై సైంటిస్టులు పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వారు పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అవేమిటంటే.. పొగతాగడం మానేసిన 20 నిమిషాల తరువాత గుండె కొట్టుకునే రేటు తగ్గుతుంది. ధూమపానం మానేసిన 12 గంటల అనంతరం రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ లెవల్స్ సాధారణ స్థితికి చేరుకుంటాయి. అదే పొగ తాగడం మానేసిన 1-2 రోజుల తరువాత గుండె వంటి ముఖ్యమైన అవయవాలకు మరింత ఆక్సిజన్ సరఫరా అవుతుంది. దీంతో వాటి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
4 ఏళ్ల పాటు పాటించాలి..
ఇక పొగ తాగడం మానేసిన 4-5 రోజుల తరువాత కొందరికి తల తిరిగినట్లు, వాంతికి వచ్చినట్లు, వికారంగా అనిపిస్తుంది. అయినా తట్టుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో కొందరికి తలనొప్పి కూడా వస్తుంది. అయినప్పటికీ భరించాలి. దీంతో నెమ్మదిగా మీకు ధూమపానం చేయాలనే కోరిక నశిస్తుంది. ఇక మీరు గనక 4 ఏళ్ల పాటు పొగ తాగడం మానేస్తే ఇక మీరు వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు. మీ శరీరం అంతకు ముందు ఎలా ఉండేదో అలా మారిపోతుంది. మీరు కూడా పొగ తాగడం అలవాటు లేని వారిలా ప్రవర్తిస్తారు. శరీరం కూడా ఆరోగ్యంగా మారుతుంది. కనుక పొగ తాగడం మానేయండి. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం నేర్చుకోండి. దీంతో ఆయుష్షును పెంచుకోవచ్చు. రోగాలు రాకుండా చూసుకోవచ్చు.