Coffee : రోజూ ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రించే వరకు.. చాలా మంది అనేక రకాల ఒత్తిళ్లతో సతమతం అవుతుంటారు. దీంతో గుండె జబ్బులు వస్తున్నాయి. అధిక ఒత్తిడి అనేక అనారోగ్యాలకు దారి తీస్తోంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హార్ట్ ఎటాక్‌లు ఎక్కువగా వస్తున్నాయి. కనుక ఒత్తిడిని అధిగమించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే రోజూ కాఫీ తాగితే ఒత్తిడిని అధిగమించడమే కాదు.. గుండెకు ఎలాంటి ఢోకా ఉండదని సైంటిస్టులు చెబుతున్నారు. రోజూ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని చెబుతున్నారు.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన 71వ వార్షిక సైంటిఫిక్ సదస్సులో కాఫీకి, గుండె ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధంపై పలువురు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనం తాలూకు వివరాలను వెల్లడించారు. వారు 10 ఏళ్ల పాటు 4 లక్షల మందికి చెందిన హెల్త్ డేటాను విశ్లేషించారు. వారిలో కొందరు రోజుకు 1 కప్పు కాఫీ తాగేవారు ఉండగా.. కొందరు రోజుకు 2, 3, 4 కప్పుల కాఫీ తాగేవారు కూడా ఉన్నారు. అలాగే వారికి ఉన్న ఆరోగ్య సమస్యలు, వారు పాటించే అలవాట్లు, జీవన విధానం వంటి వివరాలను కూడా సేకరించారు.
ఈ క్రమంలోనే 10 ఏళ్ల పాటు ఈ డేటా మొత్తాన్ని సైంటిస్టులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. చివరకు తేలిందేమిటంటే.. రోజుకు 2 లేదా 3 కప్పుల కాఫీ తాగే వారిలో గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశాలు 15 శాతం వరకు తగ్గుతాయని.. హార్ట్ ఎటాక్ కారణంగా మరణం సంభవించే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని.. చెప్పారు. అందువల్ల రోజూ కాఫీని తాగాలని వారు సూచిస్తున్నారు.
కాఫీలో సుమారుగా 100కు పైగా బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయని.. అందువల్ల అవి గుండెను రక్షిస్తాయని అంటున్నారు. అయితే కాఫీ తాగితే హార్ట్ బీట్ పెరుగుతుందని కొందరు అనుకుంటారు. అలాంటప్పుడు కాఫీ తాగేందుకు భయపడుతుంటారు. కానీ అది సాధారణమే అని.. భయపడాల్సిన పనిలేదని సైంటిస్టులు చెబుతున్నారు. రోజుకు 2 కప్పుల వరకు కాఫీని తాగితే గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని సూచిస్తున్నారు. కాగా ఈ అధ్యయనాన్ని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న ఆల్‌ఫ్రెడ్ హాస్పిటల్ అండ్ బేకర్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు చెందిన సైంటిస్టులు చేపట్టారు.