మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మనకు అనేక రకాల ఆహారాలు, ఆయుర్వేద మూలికలు అందుబాటులో ఉన్నాయి. అయితే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలతోపాటు దాన్ని తగ్గించే ఆహారాలు కూడా ఉంటాయి. అవును. ముఖ్యంగా ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి తగ్గుతుందని సైంటిస్టులు తెలిపారు. ఈ మేరకు నేచర్ కమ్యూనికేషన్ అనే జర్నల్‌లో పలువురు సైంటిస్టులు ఈ అంశంపై తాము చేసిన పరిశోధనలకు చెందిన వివరాలను ప్రచురించారు.
స్వాన్‌సీ యూనివర్సిటీ మెడికల్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, లండన్‌లోని ఫ్రాన్సిస్ క్లార్క్ ఇనిస్టిట్యూట్‌లకు చెందిన పరిశోధకులు సంయుకంతంగా చేపట్టిన అధ్యయనాల్లో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనమవుతుందని, తద్వారా రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుందని తేల్చారు. ఫ్రక్టోజ్ ఎక్కువగా సోడాలు, కూల్ డ్రింక్స్, స్వీట్లు, ప్రాసెస్ చేయబడిన ఆహారాల్లో ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని సైంటిస్టులు తెలిపారు.
మన శరీరంలోకి సూక్ష్మ క్రిములు ప్రవేశించగానే రోగ నిరోధక వ్యవస్థ అప్రమత్తం అవుతుంది. అందులో భాగంగానే నిర్దిష్టమైన భాగాల్లో వాపులు వస్తాయి. అది అత్యంత సహజమైన ప్రక్రియ. అయితే శరీరానికి సూక్ష్మ క్రిములను అంతం చేసేందుకు, మరమ్మత్తులు చేసుకునేందుకు సమయం లేకపోతే అప్పుడు నిరంతరాయంగా వాపులు పెరుగుతాయి. ఇది తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఈ క్రమంలోనే ఫ్రక్టోజ్ ఉండే ఆహారాలను తీసుకుంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ వాపులను ఎక్కువయ్యేలా చేస్తుంది. ఫలితంగా రోగ నిరోధక వ్యవస్థ బలహీనమైన రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దీంతోపాటు డయాబెటిస్, అలర్జీలు, గుండె సంబంధ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఆయా ఆహారాలను తినకుండా ఉండాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.