ప్రస్తుత తరుణంలో సంతానం పొందలేకపోతున్న దంపతుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. అయితే ఇటీవల వెల్లడించిన గణాంకాల ప్రకారం.. సంతానం లోపం ఉన్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. దేశంలో సుమారుగా 27 కోట్ల మంది దంపతులు సంతానం పొందలేకపోతున్నారని తేలింది. వీరందరిలో సంతాన సాఫల్యత సమస్యలు ఉన్నాయని గుర్తించారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది యువత ఆలస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. కెరీర్ లో స్థిరపడిన తరువాతే పెళ్లి చేసుకుందామని చాలా మంది ఆలోచిస్తున్నారు. అందువల్లే వివాహాలు ఆలస్యంగా జరుగుతున్నాయి. అయితే పెళ్లిళ్లు ఆలస్యంగా జరిగితే వాటి ప్రభావం మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థపై పడుతోంది. ఈ క్రమంలో మహిళల్లో 35 ఏళ్లు దాటాక సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి.
ఇక పురుషుల్లోనూ ఎక్కువగా కూర్చుని పనిచేసే ఉద్యోగాలు, కంప్యూటర్ల ఎదుట కూర్చోవాల్సి వస్తుండడంతో వీర్యంలో నాణ్యత లోపిస్తోంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవడం లేదు. ఇది కూడ సంతాన లోపానికి ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.
కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించడం లేదా పట్టణాలు, నగరాల్లో కాలుష్యం ఎక్కువగా పెరిగిపోతుండడం కూడా సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తోంది. దీంతోపాటు ఒత్తిడి, ఆందోళన, శారీరక శ్రమ లేకపోవడం, అస్తవ్యస్తమైన జీవన విధానం, అధిక బరువు, హార్మోన్ల సమస్యలు, శరీరంలోకి విష పదార్థాలు చేరడం.. వంటి కారణాల వల్ల చాలా మంది జంటలకు పిల్లలు పుట్టడం లేదు.
అయితే అన్ని విధాలుగా మార్పులు చేసుకోవడంతోపాటు ఆరోగ్యవంతమైన జీవనశైలిని పాటిస్తే సంతానోత్పత్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. దీంతో పిల్లలు పుట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.