Neem Tree Bark : ఆయుర్వేదంలో వేప చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. వేప చెట్టుకు చెందిన అన్ని భాగాలు మనకు ఏదో ఒకవిధంగా ఉపయోగపడతాయి. వేప ఆకులు, పుల్లలు, బెరడు, పువ్వులు, వేర్లు.. ఇలా వేప చెట్టులోని అన్ని భాగాలను అనేక అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఉపయోగిస్తున్నారు. అందులో భాగంగానే వాటితో అనేక ఆయుర్వేద ఔషధాలను కూడా తయారు చేస్తున్నారు. అయితే వేప చెట్టు బెరడుతో కరోనాకు చెక్ పెట్టవచ్చని కొందరు సైంటిస్టులు రుజువు చేశారు. ఈ మేరకు వారు తాజాగా ఈ వివరాలను వెల్లడించారు.
కోల్‌కతాలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)కు చెందిన కొందరు పరిశోధకులు ఇటీవల ఓ అధ్యయనాన్ని చేపట్టారు. అందులో భాగంగా వేప చెట్టు బెరడు నుంచి తీసిన సమ్మేళనాలను కరోనా ఇన్‌ఫెక్షన్ వచ్చిన మనిషి ఊపిరితిత్తుల కణాలపై ప్రయోగించారు. దీన్ని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోలోని నాగెల్స్ ల్యాబ్‌లో చేపట్టారు.
అయితే వేప చెట్టు బెరడులోని సమ్మేళనాలు కరోనా వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నాయని.. ఆ వైరస్ కణాలు మన శరీర కణాల్లోకి ప్రవేశించకుండా వేప చెట్టు బెరడులోని సమ్మేళనాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని గుర్తించారు. ఈ మేరకు వారు ఓ కంప్యూటర్ మోడల్ ద్వారా ఈ ప్రయోగాలు చేపట్టారు. దీంతో కరోనాకు చెక్ పెట్టే గుణాలు వేప చెట్టులో ఉన్నాయని అంటున్నారు.
వేప చెట్టు ఆకులు, బెరడులో అనేక గుణాలు ఉంటాయి. వాటిల్లోని కొన్ని సమ్మేళనాలు యాంటీ వైరల్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. అందువల్లే ఇది సాధ్యమైందని సైంటిస్టులు చెబుతున్నారు. వేప చెట్టు బెరడు ద్వారా ఇప్పటికే మలేరియా, జీర్ణాశయం, పేగుల అల్సర్లు, చర్మ వ్యాధులు వంటి అనేక వ్యాధులకు చికిత్సను అందిస్తున్నారు. ఆ బెరడలో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. కనుకనే అవి కరోనాను అడ్డుకుంటున్నాయని.. తేల్చారు. అయితే దీనిపై త్వరలోనే మరిన్ని ప్రయోగాలు చేసి ఒక యాంటీ వైరల్ డ్రగ్‌ను రూపొందిస్తే.. దాంతో భవిష్యత్తులో ఎలాంటి కరోనా వేరియెంట్ వచ్చినా తట్టుకోవచ్చని.. ప్రాణాపాయం రాకుండా చూడవచ్చని అంటున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తామని తెలిపారు.