శనగల వల్ల మనకు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి కనుక వీటిని తినడం వల్ల మనకు శక్తి లభిస్తుంది. అలాగే పోషకాలు కూడా అందుతాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు భోజనానికి ముందు మొలకెత్తిన శనగలను తింటే భోజనం తరువాత వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినట్లు గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ)కి చెందిన పరిశోధకులు వివరాలను వెల్లడించారు.
భోజనానికి ముందు 50 గ్రాముల మొలకెత్తిన శనగలను కొందరికి తినమని ఇచ్చారు. ఈ క్రమంలో వాటిని తిన్నవారిలో భోజనం అనంతరం షుగర్ స్థాయిలను చెక్ చేయగా అవి తగ్గినట్లు గుర్తించారు. అందువల్ల మొలకెత్తిన శనగలు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని సైంటిస్టులు తేల్చారు. అలాగే డయాబెటిస్ ముప్పు ఉండే వారు వీటిని తినడం వల్ల డయాబెటిస్ రాకుండా చూసుకోవచ్చని తెలిపారు.
శనగలను మొలకెత్తించి తినడం ద్వారా డయాబెటిస్ మాత్రమే కాదు. ఇంకా అనేక లాభాలు కూడా కలుగుతాయి. మొలకెత్తిన శనగల్లో సాధారణం కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇవి పోషకాల గనిగా చెప్పవచ్చు. నిత్యం వీటిని తింటుంటే షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడమే కాకుండా, ఇతర ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.