ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది సామెత. అయితే, ఇంతవరకు వెల్లుల్లి అధిక రక్తపోటునే నివారిస్తుందని అందరికి తెలుసు. కాని ఇపుడు, తాజాగా వెల్లుల్లిలో కణాల డ్యామేజీని అరికట్టే మిశ్రమం ఒకటి గుండె జబ్బులను నివారించగలదని కూడా రీసెర్చర్లు కనుగొన్నట్లు లండన్ నుండి పిటిఐ వార్తా సంస్ధ తెలియజేస్తోంది.
కరోనరీ ఆర్టరీలు బ్లాక్ అయిన కొన్ని ఎలుకలపై వెల్లుల్లి లోని డయాలీ ట్రైసల్ఫైడ్ అనే పదార్ధాన్ని ప్రయోగిస్తే, వాటిలోని గుండెకణాల డ్యామేజీ సుమారుగా రెండింట మూడు వంతులు తగ్గిపోయినట్లు అమెరికాలోని ఎమోరీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ రీసెర్చర్లు కనుగొన్నారు.
డయలీల్ ట్రైసల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ ను రిలీజ్ చేస్తుందని, ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ గుండె కణాలను రక్షిస్తుందని తెలుస్తోంది. ఈ కొత్త అధ్యయనంలో రీసెర్చర్లు వెల్లుల్లి నూనెను గుండెకు అవసరమైన హైడ్రోజన్ సల్ఫైడ్ ఉపయోగానికిగాను వాడారు. కనుక ఇక వెల్లుల్లిపాయను మనం రక్తపోటు నివారణకే కాక గుండె సంబంధిత వ్యాధులను అరికట్టటానికి కూడా ధారాళంగా వాడేయవచ్చుట.