ఆలు చిప్స్, చాకొలేట్లు, ఇతర ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు.. వీటిని అధికంగా తింటున్నారా ? అయితే జాగ్రత్త. మీకు కిడ్నీ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సైంటిస్టులు ఈ విషయాన్ని తాము చేసిన పరిశోధనల ద్వారా తాజాగా వెల్లడించారు. తరచూ ఆయా ఆహారాలను తినే వారిలో అనారోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు వస్తాయని తెలిపారు.
చక్కెర, కొవ్వులు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్‌ను తినడం వల్ల వాటిల్లో ఉండే అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ (ఏజీఈ) శరీరంలో మెయిల్లర్డ్ ప్రతిచర్యకు కారణం అవుతాయి. దీంతో శరీరంలో వాపులు వస్తాయి. ఫలితంగా స్థూలకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు తెలిపారు.
సైంటిస్టులు తాము చేపట్టిన పరిశోధనల తాలూకు వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. సదరు ఆహారాల వల్ల శరీరంలో లీకీ గట్ సిండ్రోమ్ అనే సమస్య వస్తుందని, ఇది కిడ్నీ వ్యాధులకు కారణమవుతుందని సైంటిస్టులు హెచ్చరించారు. అయితే దీని నుంచి బయట పడాలంటే నిత్యం పౌష్టికాహారాన్ని తీసుకోవాలని, ముఖ్యంగా పాలు, తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తినడం వల్ల కిడ్నీ వ్యాధులు రాకుండా ఉంటాయని సైంటిస్టులు తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాలను వెల్లడించారు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365