Wine : మద్యం అతిగా సేవిస్తే అన్నీ అనర్థాలే సంభవిస్తాయి. మద్యంను మోతాదులో సేవిస్తే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ విషయాన్ని సైంటిస్టులు ఇది వరకే చెప్పారు. అయితే ఆ సైంటిస్టులే తాజాగా మరొక విషయాన్ని వెల్లడించారు. అదేమిటంటే.. రోజూ ఆహారంతో పరిమిత మోతాదులో వైన్ తాగడం వల్ల షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చని తేల్చారు. అవును ఇది నిజమే. ఈ మేరకు టులేన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు ఓ అధ్యయనం చేపట్టారు. వారు ఓ సదస్సులో ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.

సదరు సైంటిస్టులు 3,12,400 మంది మద్యం సేవించే వారి వివరాలను సేకరించారు. వారి ఆహారపు అలవాట్లు, మద్యం అలవాట్లను తెలుసుకున్నారు. అలాగే వారికున్న వ్యాధుల గురించి కూడా వివరాలను తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆ సమాచారాన్నంతా విశ్లేషించారు. చివరకు తేలిందేమిటంటే.. రోజూ ఆహారంతో పరిమిత మోతాదులో మద్యం సేవించే వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు 14 శాతం వరకు తగ్గాయని నిర్దారించారు. అందువల్ల రోజూ తక్కువ మోతాదులో మద్యం సేవిస్తూ ఆహారం తీసుకుంటే షుగర్ లెవల్స్ తగ్గుతాయని చెబుతున్నారు.
అయితే షుగర్ ఉన్నవారు మద్యం సేవించవచ్చా ? అందులో క్యాలరీలు అధికంగా ఉంటాయి కదా ? అని అనుకునేవారు వైన్ తాగవచ్చు. ఎందుకంటే మిగిలిన మద్యం వెరైటీలతో పోలిస్తే వైన్ లో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కనుక షుగర్ ఉన్నవారు వైన్‌ను తాగవచ్చు. దీన్ని రోజూ పరిమిత మోతాదులో లేదా వారంలో రెండు సార్లు పరిమిత మోతాదులో ఆహారంతో కలిపి తీసుకుంటే షుగర్ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అయితే మోతాదుకు మించితే మాత్రం అనర్థాలు సంభవిస్తాయని.. కనుక తీసుకునే విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు.
కాగా సైంటిస్టులు చేపట్టిన ఈ అధ్యయనం తాలూకు వివరాలను సైటెక్ డెయిలీలో ప్రచురించారు. అలాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్‌కు చెందిన ఎపిడెమియాలజీ, ప్రివెన్షన్, లైఫ్ స్టైల్ అండ్ కార్డియో మెటబాలిక్ హెల్త్ కాన్ఫరెన్స్ 2022లోనూ తెలియజేశారు.