Bodhi Dharma : ఆత్మ రక్షణ కోసం తప్పకుండా నేర్చుకోవాల్సిన వాటిల్లో మార్షల్ ఆర్ట్స్ కూడా ఒకటి. ఈ మార్షల్ ఆర్ట్స్ ను ప్రపంచానికి తెలియజేసింది మన వారే అంటే మనలో చాలా మంది నమ్మరు. కానీ ఇది మరుగున పడిపోయిన నిజం. చైనా వాళ్లకు యుద్ధ తంత్ర విద్యలు నేర్పిన మన రాజకుమారుడు బోధి ధర్ముడు. ఇతని గురించి మనలో చాలా మందికి అసలు తెలియనే తెలియదు. బోధి ధర్ముడి గురించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 5వ శతాబ్ద కాలంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన పల్లవ రాజు, సుగంధిని ల మూడవ సంతానమే బోధి ధర్మ. ఎంతో తెలివివంతుడైన ఇతడు చిన్నతనంలోనే యుద్దతంత్రాలను, ఆయుర్వేదాన్ని, యోగా వంటి వాటిల్లో విశేష ప్రావీణ్యాన్ని సంపాదించాడు.
సుఖాల మీద విరక్తి చెందిన బోధి ధర్మ సింహాసనాన్ని త్యజించి బౌద్ధ గురువైన ప్రజ్ఞాతర దగ్గర చేరి కఠోర సాధన ద్వారా బుద్ధత్వాన్ని పొందుతాడు. అప్పటి వరకు బోధి తారగా పిలవబడి ఇతడు బౌద్ధం స్వీకరించిన తరువాత బోధి ధర్మగా పిలవబడతాడు. బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేయాలని మూడు సంవత్సరాల పాటు ఇండోనేషియా, మలేషియా ప్రాంతాల్లో తన బోధనలను వినిపిస్తూ చైనాకు చేరుకుంటాడు. బోధి ధర్మ చైనా చేరుకున్న సమయంలో దక్షిణ చైనాను వూ అనే చక్రవర్తి పాలిస్తూ ఉంటాడు. పరివారం ద్వారా తన దేశంలోకి వచ్చిన బోధి ధర్మ గురించి తెలుసుకున్న చక్రవర్తి అతనిని రాజ నివాసానికి పిలిపిస్తాడు. బోధి ధర్మకు మర్యాద చేసి.. నేను అనేక దాన ధర్మాలు చేశాను. ఆరామాలను కట్టించాను. వీటన్నింటి ఫలితంగా నాకు మోక్షం కలుగుతుందా అని అడుగుతాడు.
చక్రవర్తి మాటలు విన్న బోధి ధర్మ కోపాన్ని తెచ్చుకుని మనం ఏం చేసినా ఫలితాన్ని ఆశించకుండా చేయాలనే చెబుతాడు. దీంతో చక్రవర్తికి కోపం వచ్చి తన రాజ్యం నుండి బోధి ధర్మను బయటకు పంపిస్తాడు. దీంతో తన మాటలు అక్కడి వాళ్లకు అర్థం కాలేదని గ్రహించిన బోధి ధర్మ నదిని దాటి ఉత్తర చైనాను చేరుకుంటాడు. అక్కడ షావొమి నగరం దగ్గర ఉన్న కొండ గుహల్లో తొమ్మిది సంవత్సరాల పాటు ధ్యాన ముద్రలో ఉండిపోతాడు. అన్ని సంవత్సరాల పాటు అన్న పానీయాలను ముట్టుకోకుండా ఉన్న బోధి ధర్మను చూసి ఆసక్తి పెంచుకున్న హ్యూక్ అనే యువకుడు అతని దగ్గర శిష్యుడుగా చేరాలని నిర్ణయించుకుని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తాడు. చివరకు ఆ యువకుడు తన చేతిని నరుక్కోవడంతో ధ్యాన ముద్ర నుండి బయటకు వచ్చిన బోధి ధర్మ అతని దృఢసంకల్పానికి మెచ్చుకుని హ్యూక్ ను తన శిష్యుడుగా స్వీకరిస్తాడు.
హ్యూక్ తోపాటు మరి కొంతమందిని శిష్యులుగా చేర్చుకుని వారికి అనేక విద్యలు నేర్పిస్తాడు. ఆ సమయంలో షావొమీ నగరంపై బందిపోట్ల దాడులు ఎక్కువగా జరిగేవి. ఈ పరిస్థితిని గ్రహించిన బోధిధర్మ అక్కడి వారికి తాను భారత దేశంలో నేర్చుకున్న రాజయోగం, భారత యోగాలను మిళితం చేసి ఆతత్మరక్షణ విద్యను బోధిస్తాడు. అదే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చలామణిలో ఉన్న మార్షల్ ఆర్ట్స్. అయితే హ్యూక్ ను తన వారసుడిగా చేయడం కొంత మందికి నచ్చకపోవడంతో బోధి ధర్మ తినే ఆహారంలో విషాన్ని కలిపి అతడిని చంపేస్తారు. చనిపోయిన బోధి ధర్మను అక్కడే సమాధి చేస్తారు. ఇలా మూడు సంవత్సరాలు గడిచిపోతాయి.
ఒక రోజు దక్షిన చైనా మంత్రికి బోధి ధర్మ ఒక పర్వత సమీపంలో భుజానికి కర్ర వేసుకుని దానికి ఒక చెప్పును తగిలించుకుని వెళుతూ కనిపిస్తాడు. బోధి ధర్మ చనిపోయిన విషయం తెలియని అతడు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని బోధి ధర్మను అడుగుతాడు. నేనే నా దేశానికి వెళుతున్నాను కానీ నువ్వు నన్ను చూసిన విషయం ఎవరికీ చెప్పకు. ఒక వేళ చెబితే చిక్కుల్లో పడతావని, అంతేకాకుండా మీ చక్రవర్తి వూ త్వరలోనే మరణిస్తాడని చెబుతాడు. దీంతో మంత్రి కంగారుగా వెళ్లి తన చక్రవర్తితో జరిగిన విషయం చెబుతాడు. బోధి ధర్మ చనిపోయిన విషయం తెలిసిన చక్రవర్తి తన మంత్రి చెప్పిన మాటలను కట్టు కథలుగా భావించి అతనిని చెరసాలలో బంధిస్తాడు.
అసలు ఎందుకైనా మంచిదని బోధి ధర్మ సమాధిని తవ్వి చూడగా అక్కడ ఒక చెప్పు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత కొంతకాలానికి వూ మరణిస్తాడు. బోధి ధర్మ మూడు సంవత్సరాల పాటు నిద్రలో ఉండి ఆ తరువాత భారత దేశానికి వచ్చాడని చరిత్ర కారుల అభిప్రాయం. బోధి ధర్మ ఇప్పటికీ కూడా హియాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడని కొందరు అంటారు. పెద్ద కళ్లు, గుబురు గడ్డం, విశాలమైన శరీరంతో ఉండే బోధి ధర్మ విగ్రహాలను మనం చైనా, జపాన్ వంటి దేశాల్లో ఇప్పటికీ చూడవచ్చు. కొన్ని సినిమాల్లోనూ ఇప్పటికే బోధి ధర్మ గురించి చెప్పారు. అందువల్ల కొందరికి అతని గురించి తెలిసినా.. చాలా మందికి మాత్రం తెలియదు.