Gold : భారతీయులకు, బంగారానికి వీడదీయరాని అనుబంధం ఉంది. మన వారి దగ్గర ఎంత బంగారం ఉంటే అంత హోదాగా భావిస్తారు. మననిత్య జీవితంలో అంతర్భాగామైన బంగారానికి అంత విలువ ఎలా వచ్చింది. అసలు బంగారం ఎలా ఏర్పడుతుంది. బంగారాన్ని మనం తయారు చేయగలమా.. బంగారాన్ని కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడూ అరకొరగా ఉండే దానికి విలువ, గిరాకీ ఎక్కువగా ఉంటుంది. ఈ సూత్రం బంగారం విషయంలోనే సరిపోతుంది. బంగారం అనేది అంత సులువుగా ఏర్పడే మూలకం కాదు. ప్రస్తుతం మన శరీరం మీద ఉండే బంగారం ఇప్పటిది కాదు. సూర్యుడు, భూమి ఏర్పడక ముందే బంగారం తయారయి సిద్దంగా ఉంది. అది ఎలా అంటే..
ఏదైనా ఒక పెద్ద నక్షత్రం పేలినప్పుడు సూర్యుడి మధ్య భాగంలో ఉండే వేడి కంటే కొన్ని వేల రెట్ల వేడి ఉత్పన్నమవుతుంది. అంత పీడనం ఏర్పడినప్పుడు దానిలో నుండి హైడ్రోజన్, హీలియం వంటి మూలకాలన్నీ కలిసి బంగారం అణువులుగా ఏర్పడుతాయి. అలా ఏర్పడిన బంగారం అణువులు ఈ నక్షత్రం యొక్క పేలుడు ధాటికి విశ్వంలోని నలుమూలలకు విసిరివేయబడ్డాయి. ఇలా విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న బంగారం అణువులు భూమి ఏర్పడినప్పుడు కొన్ని భూమిలో కలిసిపోయాయి. ఇలా భూమిలో అంతర్భాగమైన బంగారం అణువులు కొన్ని భూమి మధ్యలోనికి వెళ్లిపోతే కొన్ని మాత్రం భూమి పైపొరల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అయితే ఇలా భూమి పొరల్లో బంగారం దాగి ఉన్న ప్రదేశాన్ని కనుకుని అక్కడి నుండి దాన్ని వెలికితీయడం కూడా అంత సులభమేమీ కాదు.
భూమిలో కొన్ని కిలో మీటర్ల లోపల ఉన్న బంగారాన్ని కనిపెట్టి అక్కడ కొన్ని మెట్రిక్ టన్నుల బంగారు ఖనిజాన్ని తవ్వితే దాని నుండి కేవలం 6 నుండి 8 గ్రాముల బంగారం మాత్రమే బయటకు వస్తుంది. ఇప్పటి వరకు 1,90,000 టన్నుల బంగారాన్ని వెలికి తీశారని ఒక అంచనా. 2050 నాటికి భూమి పై పొరల్లో ఉన్న బంగారం మొత్తం అయిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే మన శాస్త్రవేత్తలు ఇతర గ్రహాలపైన బంగారాన్ని అన్వేషించడం ప్రారంభించారు. బంగారానికి ఉన్న గొప్పగుణం ఏంటంటే ఇది మిగతా లోహాల్లాగా వెంటనే స్పందించదు. నైట్రిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపి తయారు చేసిన ఆక్వారెజియా అనే ద్రవంలో బంగారం కరుగుతుంది. అలాగే పాదరసంలో కూడా బంగారం కరుగుతుంది. బంగారం పాదరసంలో కరగడం వల్ల ఏర్పడిన మిశ్రమ ధాతువును రసమిశ్రమ లోహం లేదా నవవీతం అని అంటారు.
బంగారానికి సాగే గుణం ఎక్కువగా ఉంటుంది. ఒక ఔన్సు బంగారం నుండి 80 కిలో మీటర్ల సన్నని తీగను సాగదీయవచ్చు. బంగారానికి ఇంతలా సాగే గుణం ఉన్నది కనుకనే దీంతో తయారు చేసిన ఆభరణాలు సాగిపోకుండా దృఢంగా ఉండడానికి బంగారంలో రాగి, జింక్ వంటి లోహాలను కలుపుతారు. బంగారం నాణ్యతను క్యారెట్ లలో లెక్కిస్తారు. ఎన్ని ఎక్కువ క్యారెట్ లు ఉంటే అది అంత స్వచ్ఛమైన బంగారం అని అర్థం. 24 క్యారెట్ లు అనగా దీనిలో 99.9 శాతం బంగారం ఉందని అర్థం. అలాగే 22 క్యారెట్ లు ఉంటే 91.6 శాతం బంగారం, మిగతాది వేరే లోహాల మిశ్రమం అని అర్థం. బీఐఎస్ మార్క్ అంటే బంగారానికి మన ఇండియా వారు ఇచ్చే సర్టిఫికెట్. అలాగే 22 క్యారెట్ ల బంగారం పైన 22 కె 916 అని ఉంటుంది. బంగారం కొనేటప్పుడు వ్యాపారులు చెప్పేది విని మోసపోకుండా ఈ మార్క్ చూసి కొనుగోలు చేయాలి.
బంగారం నాణ్యతను గీటురాయితో పరీక్షిస్తారు. బంగారం భార లోహం కావున స్వచ్ఛమైన బంగారు నాణాన్ని పైకి ఎగర వేస్తే కిందపడినప్పుడు మెత్తని శబ్దం వస్తుంది. అదే అలా కిందపడినప్పుడు ఎక్కువ శబ్దం వస్తే దానిలో మిగతా లోహాలు కలిశాయని అర్థం చేసుకోవాలి. ఒక కాసు లేదా సవరం బంగారం అంటే ఎనిమిది గ్రాములు. తులం బంగారం అంటే 11.66 గ్రాములు. దేశవిదేశీయ రాజకీయాల, సమాజిక, ఆర్థిక పరిస్థితులు బంగారం ధరపైన ప్రభావం చూపిస్తాయి. పరిస్థితులన్నీ సక్రమంగా ఉంటే ఇన్వెస్టర్లు బంగారం మీద పెట్టుబడి పెట్టడం మానేసి స్టాక్ మార్కెట్ ను ఎంచుకుంటారు. అప్పుడు బంగారానికి విలువ తగ్గి ధర తగ్గుతుంది.
ఏదైనా సంక్షోభం ఎదురైనప్పుడు ఇన్వెస్టర్లు రిస్క్ చేయకుండా బంగారం మీద ఎక్కువగా పెట్టుబడి పెడతారు. అప్పుడు బంగారానికి డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11 శాతం బంగారం మన దేశంలోనే ఉంది. సుమారుగా మన దేశంలో 24 వేల టన్నుల బంగారం ఉందన్నమాట. ఇంకా లెక్కకు అందకుండా నిధులు, నిక్షేపాలు, నేల మానిగల్లో మరింత బంగారం నిక్షిప్తమై ఉంది. బంగారం తయారు చేయాలంటే విశ్వం ఏర్పడినప్పటి పరిస్థితులను సృష్టించాలి. అంత పీడనం సృష్టించాలి. ఇప్పుడున్న టెక్నాలజీతో అది సాధ్యం కాదు. కొన్ని ఆకుల పసరుతో బంగారం తయారు చేసే విద్య మన ఋషుల వద్ద ఉందని చెబుతారు. ఈ విద్య గురించి కొన్ని రహస్య తాళపత్ర గ్రంథాల్లో ఉందట. కొన్ని రకాల ఆకుల పసరును రాగి మీద పూస్తే రాగిలో రసాయనిక చర్య జరిగి బంగారంగా మారుతుందట. అయితే దీని గురించి దాదాపుగా ఎవరికీ తెలియదనే చెప్పవచ్చు.