Pyramid : ఈ అనంత సృష్టిలో మనిషికి తెలిసింది చాలా కొద్ది భాగం మాత్రమే. అన్వేషించే కొద్దీ ఏదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంటుంది. మనకే అన్నీ తెలుసు, మన తాత ముత్తాలకు ఏమీ తెలియదు అనుకుంటే పొరపాటే. మన కంటే మన పూర్వీకులు ఎంతో గొప్ప వారు. శాస్త్ర సాంకేతిక విషయాల్లో ఆనాడే ఎంతో ముందడుగు వేశారు. కానీ యుద్ధాలు, విపత్తుల కారణంగా వారి ఆవిష్కరణలు, నాగరికత చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని మాత్రం ప్రకృతి విపత్తులను తట్టుకుని వారి సాంకేతిక పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. అలాంటివే ఈజిప్టు పిరమిడ్లు. 4,500 సంవత్సరాల పూర్వం ఈజిప్టును ఫారో రాజులు పరిపాలించే వారు. మనకు రాముడు, కృష్ణుడు ఎలాగో ఈజిప్షియన్లకు ఫారో రాజులు అలా అన్న మాట. వీరిని దైవదూతలుగా భావించే వారు. పవిత్ర కార్యం కోసం భూమి మాదకు వచ్చిన వీరు ఆ కార్యం పూర్తవగానే తిరిగి పరలోకానికి చేరుకుంటారని విశ్వసించిన ఈజిప్షియన్లు వారు చనిపోయిన తరువాత వారి శరీరాలను పాడవకుండా మమ్మీలుగా మార్చి రాతి కట్టడాల్లో భద్రపరిచేవారు.
ఇక్కడ వీరి శరీరం విచ్ఛిన్నం అవ్వకుండా ఉన్నంత సేపు పరలోకంలో వారు జీవించి ఉన్నారని బలంగా నమ్మేవారు. అలా నిర్మించిన రాతి కట్టడాలే ఇప్పుడు మనకు కనిపిస్తున్న పిరమిడ్లు. అది ఇప్పటికి వరకు మనకు తెలిసిన చరిత్ర. కానీ వీటి నిర్మాణమే ఇప్పటికీ అంతుచిక్కకుండా ఉంటుంది. ఈజిప్టు పిరమిడ్లలో అన్నింటి కంటే పెద్దది.. ఖూఫూ అనే ఫారో తన శరీరాన్ని భద్రపరుచుకోవడం కోసం తనకు తానే నిర్మించుకున్న గిజా పిరమిడ్. దీని ఎత్తు నాలుగు వందల యాబై ఐదు అడుగులు. అంటే సుమారు నాలభై ఐదు అంతస్థుల ఎత్తన్నమాట. ప్రపంచంలో ఇదే ఎత్తైన మానవ నిర్మిత కట్టడం. ఇరవై సంవత్సరాల పాటు జరిగిన ఈ నిర్మాణంలో ఇరవై టన్నుల నుండి యాభై టన్నుల బరువు ఉండే ఇరవై మూడు లక్షల భారీ సున్నపు రాళ్లను వినియోగించారు.

ప్రతీ రోజూ ఇరవై వేల నుండి నలభై వేల మంది పని వారు పనిచేస్తూ ఎంతో కచ్చితత్వంతో ఈ గిజా పిరమిడ్ ను నిర్మించారు. ప్రస్తుత కాలంలో ఈ పిరమిడ్ ను నిర్మించాలంటే అక్షరాల ముప్పై వేల కోట్ల ఖర్చవుతుందట. అది కూడా అంత తక్కువ సమయంలో సాధ్యం కాదని చెబుతున్నారు. నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేదు అని మనం అనుకుంటున్న ఈజిప్షియన్లు ఎలా ఈ భారీ నిర్మాణాన్ని కట్టగలిగారు అనేది ఇప్పటికీ అంతుచిక్కకుండానే ఉంది. గిజాలో నిర్మించిన మూడు భారీ పిరమిడ్లలో ఫారో రాజులకు ఏలియన్లు సహాయం చేశారని వారు అందించిన సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ భారీ నిర్మాణాలను కచ్చితమైన కొలతలతో నిర్మించారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దీనికి కొన్ని సాక్ష్యాలను కూడా చూపిస్తున్నారు.
రాత్రి పూట ఆకాశంలో ప్రకాశవంతంగా మూడు నక్షత్రాలు కనిపిస్తాయి. వీటినే ఓరియన్ బెల్ట్ అని అంటారు. ఎలైన్ తక్, ఆల్ నిలమ్, మింటక అనే ఈ మూడు నక్షత్రాలు ఈ మూడు పిరమిడ్ల పైన కచ్చితంగా ఉంటాయి. ఈ మూడు నక్షత్రాల పైన ఉన్న గ్రహాంతర వాసులు భూమి మీదకు రావడానికి వీలుగా వీటిని నిర్మించడానికి ఫారో రాజులకు సహాయం చేశారని చెబుతున్నారు. అప్పట్లో ఏలియన్లకు, ఈజిప్టు రాజులకు సంబంధాలు ఉండేవట. పిరమిడ్లకు సంబంధించిన చిత్రాల్లో ఏలియన్లకు సంబంధించిన చిత్రాలు కూడా ఉన్నాయట. అయితే ఒక భారీ గ్రహశకలం ఢీ కొట్టడం వల్ల వీరి నాగరికత అంతరించిందని భావిస్తున్నారు. మరో కథనం ప్రకారం మనకు విశ్వకర్మ అనే వాస్తు శిల్పి ఉన్నట్టే ఫారో రాజులకు ఇహోటెప్ అనే వాస్తు శిల్పి ఉండేవాడట. ఆయనే ఈ పిరమిడ్లకు రూపకల్పన చేశాడని చెబుతుంటారు.
ఇప్పటికీ ఇహోటెప్ ను దేవుడిగా ఈజిప్షియన్లు కొలుస్తారు. కైరో నగరానికి దాదాపు 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న సక్కార ప్రాంతం నుండి 200 కిలో మీటర్ల దూరం వరకు విస్తరించిన సహారా ప్రాంతం వరకు వివిధ రాజ వంశస్థులు 700 వందల వరకు పిరమిడ్లను నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని ఇప్పటి వరకు 8 పిరమిడ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పిరమిడ్లలోని గిజా వద్ద నిర్మితమైన కుఫూ, కప్రే, మెంకార్ పిరమిడ్లు చాలా పెద్దవి. అప్పట్లో నైలు నది పాయలు ఈ పిరమిడ్లను నిర్మించిన పక్కనుండే వెళ్లేవట. వేలాది మంది పని వారు ఈ కొండలను తొలిచి పడవల సహాయంతో ఈ భారీ రాళ్లను ఇక్కడకు తీసుకొచ్చేవారట. ఇలా తీసుకొచ్చిన రాళ్లను ఒక క్రమంగా పేర్చుకుంటూ ఒక ఎత్తు వచ్చిన తరువాత పైకి నుండి కిందకు మెట్లు నిర్మించేవారట. ఇసుకలో నీరు పోస్తే అది ఒక లూబ్రికెంట్ లాగా పని చేస్తుంది. ఈ టెక్నిక్ ను ఉపయోగించి వారు అంత పెద్ద బండరాళ్లను సైతం సులువుగా పైకి తీసుకెళ్లి వీటిని నిర్మించారని చెబుతుంటారు.
వీటిని ఈ ఆకారంలోనే ఎందుకు నిర్మించారంటే రాత్రి సమయంలో ఆకాశంలో అల్లుకున్న దట్టమైన నల్లని ప్రాంతం భూమికి స్వర్గానికి మధ్య అడ్డుగోడ వంటిదని పిరమిడ్ చివర సన్నని అంచు ఆ దట్టమైన అడ్డుగోడకు సూచించబడి ఉంటుందని ఈజిప్షియన్లు బలంగా నమ్మేవారు. పిరమిడ్ మధ్యలో నిర్మించబడి ఉన్న రాజవంశస్థుల మృతదేహం నుండి వారి ఆత్మ పిరమిడ్ చివరన ఉన్న సన్నని మొన ద్వారా బయటకు వచ్చి అడ్డుగోడను చేధించి స్వర్గానికి చేరుకుంటారని విశ్వసించేవారు. ఈ పిరమిడ్ లో ఉండే ఆత్మ స్వర్గానికి సులువుగా చేరుకునేలా ఛాంబర్ లోరి గోడల మీద మంత్రతంత్రాలతోపాటు వారి వంశవృక్షాలను కూడా రాసేవారు.
వారు పరలోకంలో ఉపయోగించుకోవడానికి వీలుగా అనేక వస్తువులను ఉంచేవారు. అయితే పిరమిడ్ల నిర్మాణంలో మానవ శక్తితోపాటు ఏదో అతీత శక్తి వారికి సహాయం చేసిందని ఇప్పటికీ నమ్ముతారు. ఇనుము కూడా లేని రోజుల్లో కేవలం రాయితో ఇంత పెద్ద బండరాళ్లను తవ్వి ఇక్కడికి తీసుకురావాలంటే నేటి మనిషికి చిక్కని ఏదో అతీంద్రియ శక్తి వీరి వద్ద ఉండి ఉండాలి. ఖగోళ పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో భూమికి మధ్యలో ఉత్తర ధృవంలో వీటిని నిర్మించారంటే అంతరిక్షానికి చెందిన విషయాల్లో నిష్ణాతులు ఎవరైనా వీరికి సహాయం చేసి ఉండాలి. ఏది ఏమైనా ఆ రోజుల్లోనే ఇంతటి భారీ నిర్మాణం చేపట్టిన ఈజిప్షియన్ లను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.