Snake : ఈ భూమి మీద ఉండే విష కీటకాల్లో పాములు కూడా ఒకటి. వీటిని చూడగానే చాలా మంది భయపడిపోతుంటారు. కానీ వాటిని అవి రక్షించుకోవడానికి మాత్రమే మనపై దాడి చేస్తాయి. అలాగే పాముల గురించి మనలో చాలా మందికి అనేక రకాల మూఢ నమ్మకాలు ఉన్నాయి. పాములు నాగ స్వరానికి లయబద్దంగా నాట్యం చేస్తాయని మనలో చాలా మంది వినే ఉంటారు. శబ్దానికి అనుగుణంగా పాములు నాట్యం చేయడాన్ని మనలో చాలా మంది చూసే ఉంటారు. కానీ ఇది అంతా అబద్దమని నిపుణులు చెబుతున్నారు. పాములు నాగస్వరాన్ని వినలేవని, అసలు పాములకు బాహ్య చెవులు, కర్ణభేరి ఉండవని వారు చెబుతున్నారు.
పాము లోపలి చెవి చర్మానికి అనుసంధానమై ఉంటుంది. భూమి మీద వచ్చే కంపనాలను చర్మానికి, లోపలి చెవికి అనుసంధానమైన కర్ణస్థంభిక గ్రహించి ఆ తరంగాలను పాము లోపలి చెవికి అందవేస్తుంది. ఈ విధంగా మాత్రమే పాము శబ్దాలను గ్రహించగలదు. గాలి ద్వారా వచ్చే శబ్ద తరంగాలను పాము వినలేదు. అయితే పాము శబ్దానికి అనుగుణంగా నాట్యం ఎలా చేస్తుంది.. అనే సందేహం మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. పాము ముందు నాగస్వరం ఊదే వ్యక్తి ముందుగా పాము బుట్ట మీద కొడతాడు. ఆ కంపనాలను గ్రహించిన పాము లేచి పగడ విప్పుతుంది. పాము అలా పడగ విప్పగానే నాగస్వరం ఊదే వ్యక్తి బూరను అటూ ఇటూ కదిలిస్తూ ఊదుతాడు.
ఆ బూరను కాటు వేయాలనే ఉద్దేశ్యంతో బూరను ఎటు వైపు తిప్పితే అటు వైపు పాము కూడా పడగను తిప్పుతుంది. అంతేకానీ ఆ వ్యక్తి ఊదే నాగస్వరానికి అనుగుణంగా పాము నాట్యం చేయదు. బూరకు బదులుగా ఏదైనా వస్తువును కదిలించిన కూడా పాము అదేవిధంగా పడగను ఆడిస్తుంది. అలాగే పాము పగబట్టి కాటు వేస్తుందని మనలో చాలా మంది విశ్వసిస్తారు. అసలు పాములకు కళ్లు కూడా సరిగ్గా పని చేయవు. ఎదుటి వ్యక్తులను, వస్తువులను అవి సరిగ్గా చూడలేవు. తన సంతానాన్ని కూడా పాము గుర్తించలేదు. పామును దూరంగా ఒక చోట వదిలిస్తే అది అక్కడే తిరుగుతూ ఉంటుంది కానీ పాము తన స్థానానికి చేరుకోలేదు. అలాంటిది పాము పగబడుతుంది అనుకోవడం నమ్మకం మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు. కనుక పాము పగబడుతుంది.. అనడంలో అర్థం లేదని వారు అంటున్నారు.