Dog : కుక్క విశ్వాసానికి ప్రతీక. మానవుడు మచ్చిక చేసుకున్న తొలి జంతువు కుక్క. కుక్క ఏడుపును, అరుపును కూడా అపశకునంగా భావిస్తారు. కుక్కకు భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి తెలియజేసే అతీత శక్తి ఉందా.. కుక్క ఏడిస్తే ఏం జరుగుతుంది.. ఎవరైనా చనిపోయేటప్పుడు కుక్క ఎందుకు అరుస్తుంది.. ఇలా కుక్క గురించి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శివుని జటాజూటం నుండి ఉద్భవించిన కాలభైరవుడు కుక్కను తన వాహనంగా చేసుకుని దానికి కొన్ని అతీత శక్తుల్ని అనుగ్రహించాడట.
కాలభైరవుడు తనకు ఇచ్చిన దివ్య శక్తులతో కుక్క కాలంలోకి తొంగి చూసి భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను ముందే తెలుసుకోగలదట. వ్యక్తి మరణించడానికి కొన్ని గంటల ముందు యమ భటులు ఆ ప్రదేశంలో తచ్చాడుతూ ఉంటారట. వీరిని తన దివ్య నేత్రాలతో చూసిన కుక్క అక్కడ అశుభం జరగబోతోందని ముందుగా హెచ్చరించేందుకు బిగ్గరగా ఏడుస్తుందట. అలాగే శాస్త్రీయంగా కూడా కుక్కకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది. కుక్కలు తన చుట్టూ జరిగే రసాయనిక మార్పును ముందే పసిగట్టగలవట. వీటికి మనిషి కంటే వినికిడి, వాసన శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
అందుకే పోలీసులు ఏదైనా నేరం జరిగినప్పుడు ఆధారాలు సేకరించడానికి జాగిలం సహాయాన్ని తీసుకుంటారు. అలాగే కుక్క శకునం గురించి శకున శాస్త్రంలో వివరంగా చెప్పబడింది. ఆ శకునాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క ఇంటి అరుగు లేదా గోడ మీదకు ఎక్కి అదే పనిగా ఏడుస్తూ ఉంటే త్వరలో ఆ ఇంట్లో వారికి కష్టాలు ఎదురవుతాయట. కుక్క వచ్చి ఇంటి గోడను గోర్లతో గీకుతుంటే ఆ ఇంట్లో దొంగలు పడబోతున్నారని అర్థమట. కుక్క గుడి గోపురం మీదకు ఎక్కి ఏడుస్తూ ఉంటే త్వరలో ఆ గ్రామంలో అంటు వ్యాధులు ప్రబలబోతున్నాయని సూచనట.
పెంపుడు కుక్క ఒక కంటితో ఏడుస్తూ అన్నం తినకుండా పరధ్యానంగా ఉంటుంటే ఆ ఇంటి యజమానికి త్వరలో అరిష్టం జరగబోతుందని అర్థమట. కుక్క శ్మశానం వరకు ఏడుస్తూ పరుగులు పెడుతుంటే ఆ ఊరిలో ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి మరణించబోతున్నాడని అర్థమట. కుక్క అదే పనిగా మధ్యాహ్న సమయంలో మొరుగుతుంటే ఆ ప్రాంతంలో ఏదో ప్రమాదం సంభవించబోతుందని సూచనట. అలాగే ఏదైనా పని మీద బయటకు వెళ్తునప్పుడు కుక్క ఏ రకంగా ఎదురు వస్తే ఏం జరుగుతుందో కూడా శకున శాస్త్రంలో చెప్పబడింది.
బయటకు వెళ్లే సమయంలో కుక్క మాంసం లేదా ఏదైనా తియ్యని వస్తువును నోట కరచుకుని ఎదురు వస్తే ధనప్రాప్తి కలుగుతుందట. బురద అంటిన కుక్క ఎదురు వస్తే వెళ్తున్న పని సక్రమంగా పూర్తవుతుందట. బటయకు వెళ్లే సమయంలో కుక్క అడ్డుపడి తోకను, శరీరాన్ని ఆ వ్యక్తికి తాకుతూ వెనక్కి వెళ్లి మొరుగుతుంటే ఆ ప్రయాణంలో ఏదో కీడు జరగబోతోందని అర్థమట. కావున ఆ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిదట. ప్రయాణానికి బయలుదేరే ముందు సంభోగంలో ఉన్న కుక్కను చూస్తే వెంటనే ఆ ప్రయాణాన్ని మానివేయాలట. లేకపోతే ఏదో ఒక అరిష్టం సంభవిస్తుందట. అంగ వైకల్యం ఉన్న కుక్క, పిచ్చి కుక్క ఎదురు వచ్చినా కూడా అశుభమట. నల్ల కుక్క ఎదురు వస్తే లాభం కలుగుతుందట. ఇలా శునకశాస్త్రంలో పలు విషయాలను తెలియజేశారు.