Diwali : హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి ఒక్క పండుగనూ ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవడమే కాకుండా ఎన్నో ఆచార వ్యవహారాలను కూడా పాటిస్తారు. ఈ క్రమంలోనే హిందువులు జరుపుకొనే ఎన్నో ముఖ్యమైన అతి పెద్ద పండుగలలో దీపావళి పండుగ ఒకటి.
దీపావళి పండుగ రోజు పెద్ద ఎత్తున లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఇక ఈ పండుగ విషయానికి వస్తే దీపావళి పండుగ రోజు ఆడపడుచులు ఎక్కడ ఉన్నా వారి పుట్టింటికి చేరుకొని ఇంట్లో ఉన్న సోదరులకు నూనె రాసి వారికి నుదుటిన కుంకుమ తిలకం దిద్ది హారతి ఇస్తారు. అసలు దీపావళి పండుగ రోజు ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..
దీపావళి రోజు అమ్మాయిలు వేకువజాముననే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. ఇలా స్నానం అనంతరం దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో వారి సోదరులకు తలంటు నువ్వుల నూనె రాసి వారి నుదుటిపై కుంకుమ తిలకం దిద్ది వారికి హారతులు ఇవ్వాలి. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా దీపావళి పండుగ రోజు హారతులు ఇవ్వడం వల్ల అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం బలపడుతుందని అందుకోసమే దీపావళి పండుగ రోజు ఆడపిల్లలు తమ సోదరులకు హారతులు ఇస్తుంటారు.
ఇలా హారతి ఇచ్చిన అనంతరం సోదరులు వారి సోదరీమణుల పట్ల ఉన్న ప్రేమకు గుర్తుగా వారికి విలువైన కానుకలు ఇస్తుంటారు. అదేవిధంగా దీపావళి సందర్భంగా అకాల మృత్యు దోషాలు తొలగిపోవడం కోసం నరకాధిపతి యముడికి ఎంతో ప్రీతికరమైన దీపదానం చేయడం వల్ల అకాల మృత్యు దోషాలు తొలగిపోతాయని చెబుతుంటారు.