ఓమన్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ టీమ్స్ ఏషియా కప్ ఫైనల్‌లో పసికూన ఆఫ్గనిస్థాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెమీఫైనల్‌లో భారత్‌ను చిత్తు చేసిన ఆఫ్గనిస్థాన్ టీమ్ ఫైనల్‌లో లంకను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో ఆఫ్గన్ల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.
టాస్ గెలిచిన శ్రీలంక A జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. వరుస వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక A జట్టు 7 వికెట్లను కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక A జట్టులో సహాన్ అరచిగె మినహా ఎవరూ రాణించలేదు. సహాన్ 47 బంతుల్లో 64 పరుగులు చేశాడు. అందులో 6 ఫోర్లు ఉన్నాయి. చివరకు నాటౌట్‌గా మిగిలాడు. అఫ్గన్ బౌలర్లలో బిలాల్ సమి 3 వికెట్లు తీయగా ఏఎం ఘజన్‌ఫర్ 2 వికెట్లు పడగొట్టాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన ఆఫ్గనిస్థాన్ A జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. దీంతో ఆ జట్టు 18.1 ఓవర్లలో 3 వికెట్లను కోల్పోయి 134 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్ మెన్‌లలో సెదికుల్లా అటల్ రాణించాడు. 55 బంతులు ఆడిన అతను 55 పరుగులు చేశాడు. అందులో 3 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. మరో ప్లేయర్ కరిమ్ జనత్ 27 బంతుల్లో 33 పరుగులు చేశాడు. అందులో 3 సిక్సర్లు ఉన్నాయి. లంక A జట్టు బౌలర్లలో సహాన్ అరచిగె, దుషాన్ హేమంత, ఇషాన్ మలింగ తలా 1 వికెట్ తీశారు. కాగా ఈ విజయంతో ఆఫ్గనిస్థాన్ A జట్టు తొలిసారిగా ఈ తరహా టైటిల్‌ను గెలిచినట్లు అయింది.