దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం విదితమే. ఆస్ట్రేలియా నిలిపిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. మధ్యలో వికెట్లను కోల్పోయి కాస్త తడబడినా విరాట్ కోహ్లి సమయస్ఫూర్తి ఇన్నింగ్స్‌తో భారత్ విజయం సాధించింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌కు చేరుకుంది. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో సెమీ ఫైనల్ 2 విజేతతో తలపడనుంది. అయితే భారత్ ఇప్పటి వరకు చాంపియన్స్ ట్రోఫీలో ఎన్ని సార్లు ఫైనల్‌కు చేరుకుంది.. ఆ మ్యాచ్‌ల రిజల్ట్స్ ఏంటి.. అన్న వివరాలను ఒక్క సారి పరిశీలిస్తే..
ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ను మినహాయిస్తే భారత్ ఇప్పటి వరకు చాంపియన్స్ ట్రోఫీలో మొత్తంగా 4 సార్లు ఫైనల్‌కు చేరుకుంది. తొలుత 2000వ సంవత్సరంలో కెన్యా వేదికగా చాంపియన్స్ ట్రోఫీ జరగ్గా ఆ టోర్నీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడి ఓటమి పాలైంది. అనంతరం 2002లో శ్రీలంక వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ ఆడగా.. ఇరు జట్లను సంయుక్త విజేతగా ప్రకటించారు. అనంతరం 2013లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలోనూ భారత్ ఫైనల్‌కు చేరుకుని ఇంగ్లండ్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అలాగే 2017లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలోనూ భారత్ ఫైనల్‌కు చేరుకుంది. పాకిస్థాన్ చేతిలో దారుణ పరాజయం పాలైంది. మొత్తంగా చూస్తే భారత్‌కు 2 సార్లు చాంపియన్ ట్రోఫీ టైటిల్ వచ్చిందని చెప్పవచ్చు.
ఇక బుధవారం జరగనున్న 2వ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికాతో తలపడనుంది. అయితే ఒత్తిడికి దాసోహం అయ్యే సఫారి క్రికెటర్లు ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎలా ఆడుతారు అన్నదానిపైనే అందరి ఆసక్తి నెలకొంది. ఒత్తిడిని జయిస్తే సౌతాఫ్రికాను మించిన టీమ్ లేదని అంటారు. గతంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఒత్తిడికి దాసోహం అయ్యారు. మరి ఈ మ్యాచ్‌లో కివీస్‌తో ఎలా ఆడుతారో చూడాలి.