డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌతాఫ్రికా తడబడింది. వెంట వెంటనే వికెట్లను కోల్పోతూ వచ్చింది. ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. దీంతో విజయం భారత్‌ను వరించింది. ఈ విజయంతో భారత్ 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 202 పరుగులు చేసింది. భారత బ్యాట్స్‌మెన్‌లలో సంజు శాంసన్, తిలక్ వర్మ రాణించారు. మొత్తం 50 బంతులు ఆడిన శాంసన్ 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మన్ తిలక్ వర్మ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కొడ్జియా 3 వికెట్లు తీయగా, మార్కో యాన్సెస్, కేశవ్ మహారాజ్, పీటర్, క్రుగర్‌లకు తలా 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఎవరూ చెప్పుకోదగిన ప్రదర్శన చేయలేదు. ఇక భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అవేష్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశాడు. కాగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఈనెల 10వ తేదీన క్యూబెర్హాలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.