ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఎన్నో రకాల ఆటలు చలామణీలో ఉన్నాయి. వాటిలో కొన్ని గుర్తింపుకు నోచుకోనివి కూడా ఉన్నాయి. ఇంకొన్ని ప్రముఖ ఆటలుగా పేరుగాంచాయి. అలాంటి వాటిలో క్రికెట్ కూడా ఒకటి. తక్కువ దేశాలు మాత్రమే ఈ ఆట ఆడుతున్నా చూసే ప్రేక్షకులు మాత్రం ఎక్కువే. ఈ క్రమంలో ఈ ఆటలో ఉన్న పూర్తి నియమ నిబంధనలు ఇప్పటికీ కొంత మందికి తెలియవు. అయినా బంతిని బ్యాట్‌తో బాదడం, వికెట్ తీయడం, క్యాచ్ పట్టడం వంటి అంశాలు ఉన్న నేపథ్యంలో క్రికెట్ ప్రియులు ఎక్కువగా వాటినే చూస్తుంటారు. నియమ నిబంధనల గురించి పట్టించుకోకుండా కేవలం ఆటను చూసే ఎంజాయ్ చేస్తుంటారు.
అయితే ఈ ఆటలో జరిగే కొన్ని మ్యాచ్‌లలో అప్పుడప్పుడు వింతైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అవి ఆటగాళ్ల పరంగా, ప్రేక్షకుల పరంగా, అంపైర్ల పరంగా… ఎవరి వల్లయినా కావచ్చు, అవి అలా జరిగిపోతూ ఉంటాయి. ఇవి కాకుండా మ్యాచ్‌లో చోటు చేసుకునే కొన్ని సంఘటనల వల్ల ఈ ఆటకు సంబంధించిన రూల్స్ కూడా అప్పుడప్పుడు మనకు తెలుస్తుంటాయి. చాలా ఏళ్ల కిందట పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఓ వన్డే మ్యాచ్‌లో పైన చెప్పిన విధంగానే ఓ సంఘటన చోటు చేసుకుంది. అదేమిటంటే శ్రీలంక బౌలర్ వేసిన బంతిని ఓ పాకిస్థాన్ క్రికెటర్ స్వీప్ చేయబోయే క్రమంలో బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తీసుకుని గాల్లోకి లేచి వెనుకనే ఉన్న వికెట్ కీపర్ హెల్మెట్‌లో పడింది.
అప్పుడు ఆ హెల్మెట్ కీపర్ వెనుక గ్రౌండ్ మీద ఉండడం గమనార్హం. ఈ క్రమంలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఒక పరుగు కూడా తీశారు. అయితే అంపైర్ మాత్రం వారికి మొత్తం 6 పరుగులు ఇచ్చాడు. ఆశ్చర్యంగా ఉందా? అయినా అది నిజమే. ఎందుకంటే బ్యాట్స్‌మెన్ ఆడిన బంతి గాల్లోకి లేచి వికెట్ కీపర్ హెల్మెట్‌లో పడడంతో క్రికెట్ నియమ నిబంధనల ప్రకారం బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు లభిస్తాయి. దీంతో అంపైర్ ఆ 5 పరుగులతోపాటు వారు తీసిన మరో పరుగును కలిపి మొత్తం 6 పరుగులను పాకిస్థాన్ జట్టుకు ఇస్తున్నట్టు తెలియజేశాడు. కాగా ఈ వీడియోను పలువురు క్రికెట్ ప్రేమికులు యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసి దానికి వరల్డ్ స్మాలెస్ట్ సిక్స్‌గా పేరు పెట్టడం కొసమెరుపు.