ఇటీవల పొట్టి క్రికెట్లో అనేక రికార్డులు నమోదవుతుండడం మనం చూస్తున్నాం. బ్యాట్స్మెన్లు వీరవిహారం చేయడంతో స్కోరు బోర్డ్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది.తాజాగా జింబాబ్వే బ్యాట్స్‌మెన్స్ 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగులు చేశారంటే వారి బ్యాటింగ్ తీరు ఏ విధంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. టీ20 వరల్డ్ కప్ సబ్ రీజియనల్ ఆఫ్రికా క్వాలిఫయిర్ గ్రూప్ బీలో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్ రీజినల్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బుధవారం నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో గాంబియాతో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే స్వైరవిహారం చేసింది.
నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల వరల్డ్ రికార్డు సృష్టించింది. అలాగే జింబాబ్వే గతేడాది హాంగ్జౌలో మంగోలియాపై నేపాల్ నెలకొల్పిన 314-3 అంతర్జాతీయ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేసింది. జింబాబ్వే జట్టు కెప్టెన్ సికందర్ రజా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 43 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 7 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అతడు 33 బంతుల్లోనే సెంచరీ బాదడం విశేషం. ఇది అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రెండవ ఫాస్టెస్ట్ శతకం. ఈ క్రమంలో టీ20ల్లో నేపాల్ పేరిట ఉన్న అత్యధిక స్కోరు రికార్డు బద్దలైంది. 2023లో మంగోలియాపై నేపాల్ మూడు వికెట్లకు 314 పరుగులు చేసింది
జింబాబ్వే, నేపాల్ తర్వాతి స్థానాల్లో భారత్ (297/6 వర్సెస్ బంగ్లాదేశ్), అఫ్గానిస్థాన్ (278/3 వర్సెస్ ఐర్లాండ్), చెక్ రిపబ్లిక్ (278/4 వర్సెస్ టర్కీ) ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో ఛేదనలో గాంబియా 14.4 ఓవర్లలో 54 పరుగులకు కుప్పకూలింది. ఆండ్రీ జర్జు మాత్రమే (12) రెండంకెల స్కోరు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్, బ్రాండన్ చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.ఈ మ్యాచ్ ద్వారా జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా రికార్డు సృష్టించాడు. టెస్ట్ హోదా ఉన్న దేశాలకు చెందిన ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ (33 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. దీంతో 35 బంతుల్లో శతకం కొట్టిన రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ల రికార్డును బద్దలు కొట్టాడు.