ఒక స్మార్ట్‌ఫోన్ నుంచి మరో ఫోన్‌కు ఫొటోలు, వీడియోలు, పాటలను పంపుకోవాలంటే ఒకప్పుడు ఎక్కువగా షేర్ ఇట్ వంటి సాఫ్ట్‌వేర్లను వాడేవారు. కానీ ఈ యాప్‌ను బ్యాన్ చేయడంతో పలు ఇతర యాప్స్‌ను వాడుతున్నారు. వైఫై రాకతో ఇలాంటి యాప్స్ వాడకం పెరిగింది, కానీ ఒకప్పుడైతే అలా ఏవైనా షేర్ చేసుకోవాలంటే బ్లూటూత్‌నే ఎక్కువగా ఉపయోగించేవారు. అంతేకాదు హెడ్‌సెట్లు, ఇయర్ ఫోన్స్, స్పీకర్ల వంటి వస్తువులను కూడా ఫోన్లకు కనెక్ట్ చేసుకునే వారు. అయితే వైఫై, ఎన్ఎఫ్‌సీ వంటి టెక్నాలజీల రాక వల్ల ఇప్పుడు బ్లూటూత్ వాడకం తగ్గింది. కానీ ఇయర్‌ఫోన్స్, స్పీకర్స్ వంటి వస్తువుల కోసమైతే ఇప్పటికీ బ్లూటూత్‌నే వాడడం తప్పనిసరి అయింది. అయితే మీకు తెలుసా..? అసలు బ్లూటూత్‌కు ఆ పేరెలా వచ్చిందో..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
1994లో స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్ అనే కంపెనీ ఓ నూతన తరహా వైర్‌లెస్ ఆధారిత కమ్యూనికేషన్ టెక్నాలజీని కనుగొంది. దానికే తరువాత కాలంలో బ్లూటూత్ అని పేరు పెట్టారు. అయితే ఇలా ఆ టెక్నాలజీకి బ్లూటూత్ అని పేరు పెట్టడం వెనుక పలు కారణాలు ఉన్నాయి. 10వ శతాబ్దంలో డానిష్ రాజు హరాల్డ్ బ్లటాండ్ ఉండేవాడు. ఆయన పేరును ఇంగ్లిష్‌లో పిలిస్తే హరోల్డ్ బ్లూటూత్ అనే అర్థం వస్తుంది. ఆయన పేరు మీదుగానే ఆ టెక్నాలజీకి బ్లూటూత్ అని పేరు పెట్టారట.
హరోల్డ్ బ్లూటూత్ ఒకానొక సమయంలో బ్లూబెర్రీ పండ్లను తిన్నాడట. దీంతో అతని దంతాలు నీలి రంగులోకి మారిపోయాయట. ఆ క్రమంలో అతనికి బ్లూటూత్ (నీలి పళ్లు) అనే పేరు వచ్చిందని చెబుతారు. కాగా నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాలు ఏకతాటి పైకి వచ్చి కలసి కట్టుగా జీవించేందుకు హరోల్డ్ బ్లూటూత్ ఎంతగానో కృషి చేశారట. ఈ క్రమంలో డివైస్‌లను ఒకటిగా కలిపేందుకు ఉపయోగపడే ఆ నూతన టెక్నాలజీకి కూడా ఆయన పేరు మీదుగానే బ్లూటూత్ అని పేరు పెట్టారట. అదీ, బ్లూటూత్ పేరు వెనుక ఉన్న అసలు విషయం.
అయితే బ్లూటూత్ సింబల్‌ను అలా క్రియేట్ చేయడానికి కూడా హరోల్డ్ పేరే కారణమట. అతని పేరులో ఉండే హరోల్డ్ (H) బ్లూటూత్ (B) అనే రెండు ఆంగ్ల అక్షరాలను తీసుకుని వారి భాషలో రాయగా వచ్చే అక్షరాలను కలిపి బ్లూటూత్ సింబల్‌ను క్రియేట్ చేశారట. అందుకే బ్లూటూత్‌కు ఆ సింబల్ ఉంటుంది.