అసలు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు ఎందుకు పేలుతాయి..? గతంలోనూ పలు ఫోన్ల బ్యాటరీలు పేలినా, అది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే. అసలు మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు ఎంత వరకు సురక్షితం? అసలు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలు పేలడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? మనం వాటి నుంచి జాగ్రత్తగా ఉండలేమా..?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీలను లిథియం అయాన్లతో తయారు చేస్తారు. వీటిలో క్యాథోడ్, ఆనోడ్ అనే ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వీటిని పాజిటివ్, నెగెటివ్ అయాన్లని పిలుస్తారు. అందుకే బ్యాటరీలపై + (ప్లస్), – (మైనస్) అనే సింబల్స్ ఉంటాయి. అయితే క్యాథోడ్, ఆనోడ్లు రెండూ బ్యాటరీలకు చెరో వైపు ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు ఎలక్ట్రోడ్లు ఒక దానికొకటి అంటుకోకూడదు. లేదంటే పెద్ద ఎత్తున రసాయన చర్య జరిగి పేలుడు సంభవిస్తుంది. కనుకే ఈ రెండు ఎలక్ట్రోడ్లను బ్యాటరీలకు ఒక్కో వైపు పెడతారు. కాగా ఈ ఎలక్ట్రోడ్ల మధ్య విద్యుత్‌ను మోసుకునిపోయే ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. ఇవి సాధారణంగా లిథియం అయాన్లే అయి ఉంటాయి. అయితే వీటి మధ్య కూడా సెపరేటర్లను పెడతారు. ఎందుకంటే విద్యుదావేశం ఒక్కసారిగా పెరగకూడదని అలా పెడతారు. ఈ క్రమంలో బ్యాటరీలను చార్జింగ్ పెట్టినప్పుడు అయాన్లు ఒకే దిశలో ప్రవహిస్తుంటాయి. అదే బ్యాటరీ చార్జింగ్ తీయగానే ఆ అయాన్లు విద్యుత్‌ను అటు, ఇటు సరఫరా చేస్తాయి. అయితే ఇప్పుడు బ్యాటరీలు ఎందుకు పేలుతాయో అసలు విషయం తెలుసుకుందాం.
పైన చెప్పాం కదా క్యాథోడ్, ఆనోడ్లు రెండూ టచ్ కాకూడదని, వాటిని బ్యాటరీకి చెరో వైపు పెడతారని. ఆ, అవును అదే. అయితే కొన్ని ఫోన్ల బ్యాటరీలలో ఈ క్యాథోడ్, ఆనోడ్‌లకు చెందినవే పొరపాట్లు జరుగుతుంటాయి. దీని వల్ల ఆ ఫోన్లను చార్జింగ్ పెట్టగానే వాటిలో పెద్ద ఎత్తున రసాయన చర్యలు జరిగి, బ్యాటరీ హీట్ అయి అది పేలుడు వరకు దారి తీస్తుంది. అందుకే ఫోన్లు ఎక్కువగా పేలుతాయి. ఇలాంటి పొరపాట్లను బ్యాటరీ తయారీ దార్లు చేస్తారు. వాటిని మనం ఏం చేయడానికి కూడా వీలుండదు. ఇక బ్యాటరీలు పేలేందుకు మరో కారణం ఏమిటంటే, డివైస్‌ను ఎక్కువ సేపు చార్జింగ్ పెట్టడం. చార్జింగ్ అయిపోయినా డివైస్‌కు అలాగే చార్జింగ్ పెట్టి ఉంచితే దాని వల్ల బ్యాటరీలలో ఉండే అయాన్లలో విద్యుదావేశం ఎక్కువవుతుంది. దీంతో బ్యాటరీ ఎక్కువ హీట్‌కు గురవుతుంది. అంతేకాకుండా అందులో కెమికల్ రియాక్షన్స్ పెరిగి బ్యాటరీ క్రమంగా పేలుతుంది.
సాధారణంగా చాలా మందికి రాత్రి పూట ఫోన్ చార్జింగ్ పెట్టి పడుకోవడం అలవాటు. ఇలాంటి అలవాటు ఉన్నవారు వెంటనే మానేయండి. లేదంటే మీ ఫోన్ బ్యాటరీ కూడా పేలేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. డివైస్‌తో వచ్చిన చార్జర్ కాకుండా, ఇతర కంపెనీలకు చెందిన చార్జర్‌లను వాడడం వల్ల కూడా బ్యాటరీ వోల్టేజీలో హెచ్చు తగ్గులు ఏర్పడి అది పేలేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఫోన్లను ఎక్కువ సేపు ఎండలో ఉంచినా లేదంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఫోన్ ఎక్కువ సేపు ఉన్నా బ్యాటరీ వేడెక్కి పేలుతుంది. ఒక్కోసారి చార్జింగ్ మరీ తక్కువైనా హీట్ కారణంగా పేలేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి డివైస్ చార్జింగ్ కనీసం 30 – 40 శాతం ఉన్నప్పుడే పెట్టడం మంచిది. మళ్లీ 95 శాతానికి చేరుకోగానే చార్జింగ్ తీసేయాలి. దీని వల్ల బ్యాటరీ ఎక్కువ కాలం మన్నడమే కాదు, మీ ఫోన్ కూడా సురక్షితంగా ఉంటుంది.