విద్యార్థులకు గ్యాడ్జెట్లు అవసరం అవుతున్నాయి. ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫోన్, ట్యాబ్ కన్నా ల్యాప్ టాప్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. స్టోరేజ్, స్పీడ్ ఎక్కువ కనుక కేవలం ఆన్‌లైన్ తరగతులకే కాకుండా ప్రాజెక్టులకు, ఇతర పనులకు ల్యాప్ టాప్‌ను వాడుకోవచ్చు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారికి కూడా ల్యాప్‌టాప్‌లు అవసరం అవుతున్నాయి. దీంతో తక్కువ ధరకే మంచి కాన్ఫిగరేషన్ కలిగిన ల్యాప్‌టాప్‌లను వారు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ల్యాప్‌టాప్‌లను కొనేముందు 5 ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. అవేమిటంటే..
1. ల్యాప్‌టాప్‌లను తక్కువ ధరకు కొనాలని కొందరు భావిస్తారు. కానీ రూ.30వేలు, రూ.40వేలు పెట్టి కొన్నా పెద్ద కాన్ఫిగరేషన్ కాదు. కనుక కనీసం రూ.50వేలు వెచ్చించగలిగితే చక్కని ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక హెచ్‌పీ, డెల్, అసుస్ వంటి కంపెనీలు ఈ బడ్జెట్‌లో చక్కని కాన్ఫిగరేషన్ కలిగిన ల్యాప్ టాప్‌లను అందిస్తున్నాయి. కనుక రూ.50వేల బడ్జెట్‌ను మైండ్‌లో ఫిక్స్ అయితే చక్కని ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయవచ్చు.
2. ల్యాప్‌టాప్ కొనేముందు అందులో ఏ ప్రాసెసర్ ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని నిర్దారించుకోవాలి. ఇంటెల్‌లో ఇప్పుడు అద్భుతమైన ప్రాసెసర్లు వచ్చాయి. కానీ ఐ5 ప్రాసెసర్ అయితే అన్ని పనులకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక ఏఎండీలోనూ ఐ5ను పోలిన ప్రాసెసర్లు ఉంటాయి. అందువల్ల వాటిని ఎంపిక చేసుకోవచ్చు.
3. ల్యాప్‌టాప్ వేగంగా పనిచేయాలంటే ర్యామ్ చాలా ముఖ్యం. ల్యాప్ టాప్‌లో కనీసం 8 జీబీఈ ర్యామ్ ఉండేలా చూసుకోవాలి. దీంతో ల్యాప్‌టాప్ వేగంగా పనిచేస్తుంది.
4. ప్రస్తుతం ల్యాప్ టాప్‌లలో కనీసం 1టీబీ కెపాసిటీ ఉన్న హార్డ్ డ్రైవ్‌లను ఇస్తున్నారు. చాలా వరకు ఈ స్టోరేజ్ సరిపోతుంది. కానీ ఎక్కువ కావాలంటే 2టీబీ, 4టీబీ కెపాసిటీ ఉన్న హార్డ్ డ్రైవ్‌లను తీసుకోవాలి. ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్‌లు కూడా ఇవే కెపాసిటీల్లో అందుబాటులో ఉన్నాయి.
5. ల్యాప్‌టాప్ కొన్నాక చాలా మంది యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ సాఫ్ట్‌వేర్ ముఖ్యమే. ఎంతో విలువైన డేటా హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలన్నా, ల్యాప్ టాప్‌లో వైరస్ అటాక్ కాకుండా జాగ్రత్తగా ఉండాలన్నా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ ముఖ్యం. కనుక కచ్చితంగా యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్‌ను కొనుగోలు చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. రూ.600 నుంచి రూ.2000 వరకు చక్కని యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఏ సాఫ్ట్‌వేర్‌ను కొన్నా ఏడాది వరకు లైసెన్స్ ఉంటుంది కనుక ఏడాది పాటు ఏ చింత లేకుండా ల్యాప్‌టాప్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చు.