మేము హోసూర్‌లో టాటా (తనిష్క్) వారి నగలు, వాచీల తయారీ కేంద్రానికి సందర్శకులుగా వెళ్ళినపుడు లోపలకు వెళ్ళేముందు (ఆడవారు తాళితో సహా) వొంటిపై ఒక్క ఆభరణమూ ఉంచుకోకుండా తీసేయమని చెప్పారు. ఫోన్లు, పర్సులు ఏవీ ఉండకూడదు – వారిచ్చిన లాకర్లలో భద్రపరచాలి. తరువాత బాగా తనిఖీ చేశాకే లోనకు పంపారు. అంతే కాక లోపలి నుండి బయటకు వచ్చేప్పుడు ముందుగా నేలలోని పెద్ద ఫానుపై నిలబెట్టి (పొరబాటున ఏమైనా పసిడి ధూళి బట్టలకు అంటుకుంటే దులిపేసెందుకు), ఆపై గట్టిగా తనిఖీ చేసి బయటకు వదిలారు. అక్కడ పని చేసే సిబ్బంది కూడా రోజూ ఇదే తనిఖీ ప్రక్రియకు లోబడి ఉంటారు.
తనిష్క్‌కు బంగారం ఎంత విలువైనదో సాఫ్ట్‌వేర్ సంస్థకు సాఫ్ట్‌వేర్ అంతే విలువైనది. ఒక సంస్థ కార్లు రిపేర్ చేసే రోబోట్ తయారు చేస్తోంది అనుకుందాం. ఆ రోబోట్ తయారీకి లోహం కంటే రోబోట్‌కు కదలికలు, రిపేరు జ్ఞానం ఆపాదించే కోడ్ కీలకం అన్నది జగద్విదితం. ఉత్పత్తి ఎంత పెద్దదైనా, దాని కోడ్ మొత్తం ఒక పెన్‌డ్రైవ్‌లో సరిపోతుంది. ఉదాహరణకు నా మొదటి ఉద్యోగంలో పని ఎంటర్‌ప్రైజ్ రౌటర్లపై. ఈ రౌటర్లను డేటా సెంటర్లు, అంతర్జాల సంస్థల నాభికేంద్రాల్లో ఎక్కువగా వాడతారు. ఒక రౌటర్ ధర అప్పట్లో సుమారు 70 లక్షలు. రౌటర్ ఒక్కోటి సుమారు 50 కిలోల బరువున్నా దీన్ని నడిపించే కోడ్ మొత్తం ఒకటిన్నర జీ.బీ మాత్రమే. ఆ కోడ్ ఎవరైనా పెన్‌డ్రైవ్‌లో కాపీ చేసి తీసుకెళ్ళి మరో సంస్థకు అమ్మివేయటం ఇదివరకే పలు మార్లు జరిగిన ఉదంతం.
అప్పట్లో మా కంప్యూటర్లకు సీడీ డ్రైవ్లు, ఫ్లాపీ డ్రైవ్లు నిరర్ధకం చేసి ఉంచేవారు. యూఎస్బీ పోర్ట్‌లో ఏదైనా పెడితే వెంటనే ఐటీ డిపార్ట్మెంటు నుండి ఫోన్ వచ్చేది – మేనేజర్ ఆమోదం పంపమని (ముందుగా పంపి ఉండకపోతే). నేను ఆ సంస్థలో రెండున్నరేళ్ళు పని చేసి 2006 డిసెంబరులో రాజీనామా చేశాను. వెంటనే ఐటీ నుండి ఫోన్ – 2005 జనవరిలో నేను ప్రింట్ తీసుకున్న డాక్యుమెంట్ తిరిగివ్వమని. సాధారణంగా కోడ్ అనేది చాలా పకడ్బందీగా ఫైర్‌వాల్ వెనక ఉంచుతారు. కోడ్ కంటే సులువుగా దొంగతనానికి గురయేవి దస్తావేజులు. ఉత్పత్తుల డిజైన్ డాక్యుమెంట్లు బయటకు పొక్కినా సంస్థకు ఎనలేని నష్టం. ఉదాహరణకు గతంలో ఆపిల్ సంస్థకు చెందిన M1 చిప్ డిజైన్ డాక్యుమెంట్లు ఇంటర్నెట్‌లో దర్శనమిచ్చాయి. మ్యాక్‌బుక్‌లు, ఐఫోన్లు, ఐప్యాడ్లు అన్నిటినీ మిగతా సంస్థల ఉత్పత్తుల కంటే మెరుగ్గా నిలిపేందుకు ఈ చిప్ సంస్థకు ఎంతో క్రియాశీలకం. అటువంటి డాక్యుమెంట్లు బయటకు వెళితే సంస్థకు ఎంత నష్టం! అందుకే ఉద్యోగులకు పెన్‌డ్రైవ్ మాత్రమే కాదు కొన్ని సంస్థల్లో స్మార్ట్‌ఫోన్లు కూడా అనుమతించరు.