హ్యాకింగ్… నేడు కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను అత్యంత భయపెడుతున్న పదం ఇది. ఎందుకంటే దాని వల్ల కలిగే నష్టం భారీగానే ఉంటుంది మరి. అందుకే ఎవరి డివైస్ అయినా, ఇంటర్నెట్ అకౌంట్ అయినా హ్యాకింగ్‌కు గురైందంటే ఇక వారు ఎంతగానో గాభరా పడిపోతారు. అయితే ఇలాంటి టెన్షన్‌కు ఎవరూ అతీతులు కారు. ఫేస్‌బుక్ వ్యవస్థాపక సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా అలాంటి హ్యాకింగ్ ఆందోళనకు గురయ్యే వారిలో ఒకరు. హ్యాకింగ్ అంటేనే జుకర్‌బర్గ్ ఎంతగానో జాగ్రత్త పడిపోతాడు. ఎంతగా అంటే… కింద ఇచ్చింది మీరే చూడండి…
ఆ ఫొటో చూశారుగా. గతంలో ఇన్‌స్టాగ్రాంలో యూజర్ల సంఖ్య 500 మిలియన్లకు చేరుకున్నప్పుడు దాని క్రియేటర్లకు థ్యాంక్స్ చెబుతూ జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ వాల్‌పై ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో జుకర్ బర్గ్ డెస్క్‌ను, అతను వాడుతున్న ల్యాప్‌టాప్‌ను మనం క్లియర్‌గా చూడవచ్చు. ఇంకాస్త పరిశీలిస్తే ఆ ల్యాప్‌టాప్‌కు ఉన్న వెబ్ కెమెరా, మైక్రోఫోన్లు ఒక టేప్‌తో కవర్ చేయబడి ఉన్నాయి. ఇంతకీ జుకర్ బర్గ్ అలా వాటికి టేప్ ఎందుకు వేశారనేగా మీ డౌట్, అది ఎందుకో చూద్దాం పదండి…
ల్యాప్‌టాప్‌లను ఎక్కువగా వాడే యూజర్లు ఏదైనా ఒక అవాంఛిత లింక్‌ను బ్రౌజర్‌లో క్లిక్ చేస్తే అందులో ఉండే వైరస్ యూజర్ సిస్టమ్‌లోకి చేరుతుంది. ఈ క్రమంలో కొన్ని వైరస్‌లు యూజర్ ల్యాప్‌టాప్‌కు ఉన్న వెబ్ కెమెరాను యాక్సెస్ చేసి యూజర్‌కు తెలియకుండానే ఈ వీడియో ఫీడ్‌ను హ్యాకర్లకు చేరవేస్తాయి. ల్యాప్‌టాప్ మైక్రోఫోన్‌ను కూడా హ్యాకర్లు ఈ విధంగానే యాక్సెస్ చేస్తారు. దీని వల్ల యూజర్‌కు చెందిన వీడియో అంతా హ్యాకర్ల చేతిలో పడుతుంది. అప్పుడు ఎలాంటి నష్టం కలుగుతుందో అందరికీ తెలిసిందే. దాన్ని నివారించేందుకే జుకర్ బర్గ్ అలా తన ల్యాప్‌టాప్ వెబ్ కెమెరా, మైక్రోఫోన్లకు టేప్‌ను అంటించారు.
ఇప్పుడు తెలిసిందా, అసలు విషయం ఏమిటో. అయితే మరి ఫోన్లకు కూడా కెమెరాలు ఉంటాయి కదా, వాటిని ఎందుకు యాక్సెస్ చేయలేరు, అంటే, కంప్యూటర్ల కన్నా స్మార్ట్‌ఫోన్లు సెక్యూరిటీ విషయంలో అత్యంత కట్టుదిట్టంగా ఉంటాయి. అందుకే హ్యాకర్లు ఫోన్ కెమెరాలను దాదాపుగా యాక్సెస్ చేయలేరు. కానీ పీసీ కెమెరాలను మాత్రం సులభంగా యాక్సెస్ చేస్తారు. కాబట్టి జాగ్రత్త. మీరు కూడా డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లలో వెబ్ కెమెరాను వాడుతున్నట్టయితే ఓ కంట దాన్ని కనిపెట్టండి. లేదంటే మీరూ ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా హ్యాకింగ్‌కు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది.